అభివృద్ధిలో అగ్రభాగం

Sun,July 14, 2019 12:47 AM

- ఖమ్మం అభివృద్ధి కోసం నిధులకు ఢోకా లేదు
- త్వరలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
- సెంట్రల్ లైటింగ్, నూతన సిగ్నెల్స్ కూడా..
- కేఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే అజయ్
- ప్రతిపక్ష కార్పొరేటర్ల ప్రవర్తనపై ఆగ్రహం
- పన్ను కట్టకుండా నీతులా అంటూ విమర్శ
- హాజరైన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి

(ఖమ్మం, నమస్తే తెలంగాణ) కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే 31వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన పాలెపు సీతమ్మతో మేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎజెండాను మేయర్ చదువుతుండగానే కాంగ్రెస్, సీపీఎం కార్పొరేటర్లు అడ్డు తగిలారు. గత సమావేశపు తీర్మానాలను ఎంత వరకూ అమలు చేశారని ప్రశ్నించారు. దీంతో మేయర్ జోక్యం చేసుకొని ఆ విషయాలను కూడా ఎజెండాలో పొందుపరిచామని, మీరు లేవనెత్తిన అంశాలు వరుస క్రమంలో వస్తాయని, కూర్చోవాలని చెప్పారు. అయినా ఆ కార్పొరేటర్లు బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావులు, దీపక్‌చౌదరి, అప్రోజ్ సమీనాలు ఆగలేదు. చెవిలో గులాబీ పూలు పెట్టుకొని పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. ప్రతి సభ్యునికీ అవకాశమిస్తామని మేయర్ చెప్పినా వారు వినలేదు. దీంతో టీఆర్‌ఎస్ ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, 16 వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీలు జోక్యం చేసుకొని ఎజెండా చదివే వరకూ ఓపిక పట్టాలి అని సూచించారు. అయినా వారు వినకపోవడతో అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

మీ పాలనలో ఏంచేశారో తెలుసు: కర్నాటి
ఖమ్మం మున్సిపాలిటీని పరిపాలించింది మీ రెండు పార్టీలు కాదా? ఆ సమయంలో మీరు ఏంచేశారో మాకు తెలియదా? అంటూ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ ప్రశ్నించారు. అప్పట్లో ప్రతి పక్ష కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. మేం 43 మందిమి టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ఉన్నాం. అయినప్పటికీ మీకు కూడా అవకాశం ఇస్తామని చెబుతున్నాం. అయినా వినకుండా కేవలం పత్రికల్లో ఫొటోల కోసం కేకలు పెట్టడం సమంజసం కాదు. సమావేశం సజావుగా సాగకుండా అడ్డుకోవడం ఏమిటి? అని ధ్వజమెత్తారు. గడిచిన 60 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. గాంధీచౌక్ సెంటర్‌లో గాంధీ మహాత్ముని విగ్రహాన్ని నెలకొల్పింది మీరా? మేమా? అని ప్రశ్నించారు. బోసుబొమ్మ సెంటర్ అభివృద్ధికి నిధులు కేటాయించింది, గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులు చేపట్టింది మేము కాదా? అని ప్రశ్నించారు. వీరికి కార్పొరేటర్లు పాలడగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, నీరజ తదితరులు కూడా జత కలిసి ప్రతిపక్ష కార్పొరేటర్లపై ప్రశ్నల వర్షం కురిపించడంతో వారు సద్దుమణికి తమ తమ సీట్లలో కూర్చొన్నారు. దీంతో మేయర్ ఎజెండాను చదివి వినిపించగా సభ్యులు ఆమోదించారు.

ఎజెండాను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఎజెండాను అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఎం కార్పొరేటర్లపై ఎమ్మెల్యే అజయ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పాపాలాల్ తీర్మాన కాఫీలను, ఎజెండాను ప్రవేశపెడుతుండగా రెండోసారి కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు గందరగోళాన్ని సృష్టించారు. అజయ్ మైక్ తీసుకొని అధ్యక్షా.. ఏంటిది? 43 మందిమి కార్పొరేటర్లం ఉన్నాం. అయినా ప్రతిపక్ష సభ్యులకు ఇదేం పద్ధతి? ఇలా అయితే సభ ఎలా నడిచేది? ఎజెండా పూర్తి కాకముందే ఈ డ్రామాలేంటి? అంటూ మండిపడ్డారు. కూర్చో.. ఏం మాట్లాడుతున్నావ్? ఏం డ్రామాలు ఆడుతున్నారా? వైరా రోడ్డులో నీకున్న అక్రమ బిల్డింగ్‌కు టాక్స్ కడుతున్నావా? అంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ తిలక్‌పై ధ్వజమెత్తారు. అధ్యక్షా.. వారిని మీరు కంట్రోల్ చేయండి. వారికి ఇష్టం లేకపోతే బయటికి పంపించండి అని సూచించారు.

అజయ్ కారణంగానే అభివృద్ధి: కమర్తపు
నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే అజయ్, మాజీ మంత్రి కేటీఆర్‌ల పాత్ర ఎంతో ఉందని 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీ పేర్కొన్నారు. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నా ప్రతిపక్ష సభ్యులకు ఎందుకు కన్పించడంలేదని ప్రశ్నించారు. అభివృద్ధి జరుగుతున్నా అడ్డుకోవడం ఏమిటని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కూదరదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న మంత్రి, ఎంపీ సహకారంతో ఎల్‌ఆర్‌ఎస్ కింద ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ఖమ్మం నగరానికి రూ.వంద కోట్ల నిధులు తెచ్చారని గుర్తుచేశారు. ప్రతిపక్ష సభ్యులున్న డివిజన్లనూ అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు.

ఖమ్మం ముందంజ: ఎమ్మెల్యే అజయ్
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కారణంగా కొద్ది రోజులు కోడ్ అమలులో ఉన్నందున కొన్ని పనులు తాత్కాలికంగా ఆగిపోయాయని ఎమ్మెల్యే అజయ్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని సభ్యులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ శాఖ ఇంకా మెరుగ్గా పనిచేయాలని సూచించారు. కొంతమంది కాంట్రాక్టర్లు సరిగా స్పందించకపోవడం వల్ల వారిపై చర్యలు తీసుకోవాలని తానే సూచించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అప్పటి బడ్జెట్ కంటే భిన్నంగా బడ్జెట్ పెరిగిందని గుర్తుచేశారు. 2016-17, 2017-18 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ.వంద కోట్ల చొప్పున ఖర్చు చేశామని గుర్తుచేశారు. కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఖమ్మాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. విలీన పంచాయతీల్లో అనేక అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్‌లకు మరో 10 డివిజన్‌లు కలుపుకొని మొత్తం 60 డివిజన్లు పెరిగాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా రూ.300 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని అందించనున్నట్లు చెప్పారు. 2000 మంది నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ముస్తాఫ్‌నగర్ ఏరియా నాలుగు రోడ్ల విస్తరణ జరగాలని, రెండో డివిజన్‌లో డబుల్ రోడ్‌కు సెంట్రల్ లైటింగ్ నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఖమ్మం ప్రగతిని హర్షించాలని కోరారు.

సమస్యలపై దృష్టి పెట్టండి: కందాల
తన నియోజకవర్గంలోని గ్రామాలు కేఎంసీలో విలీనమయ్యాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పేరొన్నారు. వాటిలో అభివృద్ధి పనులు జరగాల్సి ఉందన్నారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సహకారం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానన్నారు. మంచిగా పనిచేయండని కోరరు. అంతకుముందు పాలేరు ఎమ్మెల్యే కందాలను ఖమ్మం ఎమ్మెల్యే అజయ్, మేయర్ పాపాలాల్ తదితరులు సన్మానించారు.

31వ డివిజన్ కార్పొరేటర్ ప్రమాణం
31వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు అక్కమ్మ గత ఏడాది అక్టోబర్ 10న మరణించగా ఈ ఏడాది మార్చి 25న జరిగిన ఉప ఎన్నికల్లో పాలెపు సీతమ్మ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. దీంతో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ పాపాలాల్.. పాలెపు సీతమ్మతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కమిషనర్‌ను మెచ్చుకున్న ఎమ్మెల్యే
కేఎంసీ కమిషనర్ శ్రీనివాస్ పనితీరును ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మెచ్చుకున్నారు. నిజాయితీ కలిగిన అధికారి ఉండటం వల్ల అభివృద్ధిలో ముందంజలో ఉన్నామన్నారు. ప్రస్తుత కమిషనర్ నిజాయితీగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ధైర్యంగా పనిచేయండి, మీ వెనుకాల మేం ఉన్నాం. అంటూ ధైర్యమిచ్చారు. ఉద్యోగులకు కూడా రక్షణ కవచంగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జగన్, ఈఈ రంజిత్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, విద్యుత్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles