రైతన్నల ఆశలు ఆవిరి..!

Mon,July 15, 2019 01:10 AM

-జూలైలోనూ కొనసాగుతున్న వేసవి తాపం
-ఇంకా ఎండాకాలంలోనే ఉన్నామా అనే భావన
-చినుకు జాడకోసం ఎదురు చూస్తున్న ప్రజలు..
-ప్రధాన పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే..
-జూలై దాటితే ప్రత్యామ్నాయ పంటలపైనే దృష్టి
ఖమ్మం నమస్తే తెలంగాణ : కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజూకు పెరుగుతున్నాయి. వేసవి కాలాన్ని మరిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఉష్ణోగ్రతలు ఆశ్చర్యం గొలిపిస్తున్నాయి. ఇప్పటికే నాటిన విత్తనాలు మొక్కలుగా పెరగాల్సి ఉంది. అయినా భూమి లోపలినుంచిపైకి రానన్నంటున్నాయి. ఒక్కొక్కరైతు గంపెడాశతో రెండు, మూడుసార్లు విత్తనాలు నాటారు. అయినా మొలకెత్తక పోవడంతో చినుకు పడగానే విత్తనం నాటుతున్నారు. చిన్న సన్నకారు రైతులకు ఇప్పటికే ఒక్కొక్కరికి దాదాపు రూ.30వేల నుంచి 80 వేలు విత్తనాలకు ఖర్చు అయ్యాయి. అయినా ఆశ చావడం లేదు. సాధారణంగా జూన్‌ నెలలో ఖమ్మం జిల్లా సాధారణ వర్షపాతం 105 మిల్లీ మీటర్లు కాగా గత నెలలో 49.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్‌లో 183 మిల్లీ మీటర్ల వర్ష కురిసింది. సాధారణం కంటే అధనంగా 74.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా గత ఏడాది జులైలో 272 మిల్లీ మీటర్ల వర్షం కురసింది. ఈ నెలలో ఇప్పటి వరకు 52 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 6.4 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది.

ఆదివారం మధ్యాహ్నం ఖమ్మంలో గరిష్టంగా సుమారు 34 సెల్సియస్‌ డిగ్రీలు నమోదైంది. గత కొన్నేళ్లుగా రికార్డులను పరిశీలిస్తే జూలైలో ఇంతటి ఉష్ణోగ్రతలు ఉండటం అరుదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోయింది. గ్రీష్మతాపం పెరిగి వెచ్చని గాలులు వీస్తున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినా మనజిల్లాలోనూ ఒకట్రెండు తొలకరి వర్షాలు కురిసినా ఇంకా వేసవి తాపంవీడకపోవడం వాతావరణంలోని అసమతుల్యతకు అద్దం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజల దైనందిన కార్యకలాపాలతో పాటు ప్రకృతితో మమేకమయ్యే వ్యవసాయ, అనుబంధ ఇతర రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.

జిల్లా వాసుల్లో ఇంకా ఎండాకాలంలోనే ఉన్నామా అనే భావన కలుగుతోంది. ఇప్పటికీ 37 నుంచి 40 సెల్సియస్‌ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడమే ఇందుకు కారణం వర్షాకాం ప్రారంభమైనందున సాధారణ స్థితికి చేరుకోవాల్సిన పగటి ఉష్ణోగ్రతలు.. ఇంకా అధికంగా నమోదవుతున్నాయి. జూన్‌, జూలై నెలలో జిల్లా సాధారణ వర్షపాతంలో 20శాతమైనా కురవలేదు. జటిలమైన తాగునీటి సమస్య అధిక ఉష్ణోగ్రతలు కరవు ప్రాంతానికి అద్ధం పడుతున్నాయి. గత పదిరోజుల్లో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 39 సెల్సియస్‌ డిగ్రీలపైనే కావడం గమనార్హం. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రారంభమై.. మేలో 44 సెల్సియస్‌ డిగ్రీల వరకు చేరింది. అయితే జూన్‌లో తొలకరి ఆశించినప్పటికీ అది జరగలేదన్నారు. ఈవర్షాలు ఉష్ణోగ్రతల నుంచి, తాగునీటి సమస్య నుంచి నగరవాసులను కాపాడలేకపోయాయి. జూన్‌ వెళ్లాక జూలై మాసంలో వర్షాలు ఉన్నాయనే సంకేతాలు అందినప్పటికీ నిరాశే మిగిలింది. జూలైలో నమోదు కావాల్సిన సాధారణ వర్షాపాతం ఈరోజు వరకు 52 మిల్లీ మీటర్లలో ఇప్పటి వరకు కేవలం 6.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో భూమి నుంచివేడి ఆవిరి ఉత్పన్నం అవుతున్నది.

పొడి వాతావరణం కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని, నాలుగైదు రోజుల పాటు వర్షం కురిసి భూమి చల్లబడితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. పొడిగాలులు కారణంగానే ఉక్కపోత ఎక్కువగా ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా సీజన్‌ల వారీగా కాకుండా రోజుల వారీగా వాతావరణంలో తేడాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు.
ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనా...
ఖమ్మం జిల్లా రైతాంగం జూన్‌ నెలలో కురిసిన సాధారణ వర్షాలకు పత్తి, వరి తదితర పంటలకు భూములను దుక్కి చేసి పంట సాగుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కష్టాలకు ఓర్చి విత్తనాలు కొనుగోలు చేసి, ట్రాక్టర్లతో దుక్కులు చేసుకుని అంతర పంటలకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంత వరకు చినుకుజాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు కురుస్తాయన్న ఆశాభావంతో రైతులు ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడితో సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం వెనుకడుగు వేస్తుండటంతో రైతులకు అప్పులు మిగులుతాయన్న ఆవేదన వ్యక్తం అవుతున్నది. ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం జూన్‌లో 105 మిల్లీ మీటర్లు కాగా కేవలం 49.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావడంతో రైతులు పంటలపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి, పత్తి విత్తేందుకు అనువైన సమయం ఇక రెండు రోజులు కావడంతో ఇప్పటికప్పుడు వర్షం కురిసినా ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఈనెలాఖరు వరకు విత్తనాలు విత్తేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. జూన్‌లో పడిన తేలికపాటి జల్లులకు పత్తి విత్తుకున్న రైతులు వర్షాభావంతో కలవరపడుతున్నారు. జూలై నెల దాటితే ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించుకోవడం తప్ప ప్రధాన పంటలపైన ఆశలు వదులుకోవాల్సిందే అని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

284
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles