బడుగుజీవులపై పిడుగు పాటు

Fri,July 19, 2019 03:13 AM

టేకులపల్లి/బూర్గంపహాడ్: టేకులపల్లి, బూర్గంపహాడ్ మండలాల్లో వేర్వేరు చోట్ల పడిన పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు, ఒక రైతు తమ ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి మండల పరిధిలోని కొప్పురాయి పంచాయతీ బర్లగూడెం - ఒడ్డుగూడెం అటవీప్రాంతం సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొప్పురాయి పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బండ తిరుమల్‌రావు, భార్య బండ అనూష(25)లు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో బర్లగూడెం - ఒడ్డుగూడెం అటవీప్రాంతంలోని తమ పత్తి చేనులో కలుపుతీసేందుకు వెళ్లారు. భర్త తిరుమల్‌రావు, కూలీలు పూనెం రవీందర్, పూనెం భద్రయ్యలు మధ్యాహ్నం భోజనం అనంతరం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభం కావడంతో కలుపుతీస్తున్న అనూష ప్రక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దగ్గరలో ఉన్న భర్త తిరుమల్‌రావు, చుట్టు పక్కల వారు భద్రయ్య, రవీందర్‌లు అక్కడకు చేరుకొని అనూషను ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందింది. తన చేతుల్లో భార్య మృతిచెందడంతో భర్త రోదనలు మిన్నంటాయి.

బర్లగూడెం సమీపంలో మరో మహిళ..
అదేవిధంగా కొప్పురాయి పంచాయతీ కొత్తూరుకు చెందిన ఎల్లబోయిన రవి, రవళి(23)లు నాలుగేళ్ల క్రితం బర్లగూడెం వెళ్లి అక్కడే నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎనిమిది నెలల పాప ఉంది. బర్లగూడెం-ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో ఉన్న తమ పత్తి చేనులో కలుపు తీసేందుకు రవి, రవళిలు తమ ఎనిమిదినెలల పాప ప్రత్యూషతో పాటుగా మోకాళ్ల వీరమ్మ అనే కూలీని తీసుకొని చేనుకు వెళ్లారు. మధ్యాహ్న భోజనం అనంతరం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభం అవుతుండటంతో అప్పటికే చెట్టుక్రింద నిద్రబుచ్చిన తమ పాప ప్రత్యూష దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడటంతో అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాసేపటికి భర్త రవి, తోటి కూలీ వీరమ్మలు సృహలోకి వచ్చారు. భార్య రవళి సృహలోకి రాకపోవడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రవళి మృతిచెందింది. ఎనిమిది నెలల ప్రత్యూష అపస్మారక స్థితి నుంచి తేరుకుంది. ప్రత్యూష మృత్యుంజయిరాలుగా బయటపడింది. హుటాహుటిన ప్రత్యూషను అక్కడి నుంచి గ్రామానికి తరలించారు. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్ ఘటనా స్థలాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. టేకులపల్లి గిర్ధావర్ నరసింహారావు, కొప్పురాయి వీఆర్వో మంగమ్మలు పంచనామా నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌లు పూనెం రాంబాబు, చింతా మంగమ్మలు మృతదేహాలను సందర్శించి వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించాయి. రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

పిడుగుపాటుకు రైతు, దుక్కిటెడ్లు మృతి
పిడుగుపాటుకు రైతు, దుక్కిటెడ్లు మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన దోమల సుందర్ (46) ఉదయం తన పత్తి చేనుకు వెళ్లాడు. పత్తిచేలో అరక దున్నుతుండగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో రైతు, ఎడ్లు అక్కడికక్కడే మృతిచెందాయి. గమనించిన పక్క పొలానికి చెందిన రైతు ధర్మావత్ బాలాజీ వెంటనే గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతిచెందిన రైతు, ఎడ్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ ఎస్‌ఐ వెంకటప్పయ్య, తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ మాధవి, వీఆర్‌వో జోగారావులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య దోమల మరియమ్మ, ఇద్దరు కొడుకులు రాజు, అశోక్, ఒక కుమార్తె లావణ్య ఉన్నారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. మృతిచెందిన ఎడ్ల విలువ సుమారు 1.50లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles