మహిళా కవుల కలాలకు పదునుపెట్టేందుకే వర్క్‌షాప్.

Sat,July 20, 2019 05:38 AM

ఖమ్మం కల్చరల్ జూలై19: రచనా రంగంలో మహిళలు తమ కలాలకు పదును పెట్టేందుకు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) దశాబ్ధకాలంగా నిరంతరం కృషి చేస్తోంది. కవిత్వం, వ్యాసాంగం, కథా రచనలో ఆసక్తి, ఆర్తి గల స్త్రీల వేదికగా ముందుకు పోతుంది. మే 11న వరంగల్‌లో నిర్వహించిన కథా విమర్శ కార్యశాలకు విశేష స్పందన వచ్చింది. ఈ స్ఫూర్తితో జిల్లా కేంద్రంలో ఈనెల 21న కవిత్వ విమర్శ-ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనుంది. మహిళలు విమర్శకులుగా పదునెక్కాలనే చైతన్యంతో ఈ కవిత్వ కార్యశాలను ఏర్పాటు చేయనుంది. అనేక కవితలు, వ్యాసాలు ఈ కార్యశాలలో చర్చకు రానున్నాయి. వీటి కోసం కొన్ని కవితలను వేదిక ఎంపిక చేసింది. కవితా విమర్శకు ఈ వేదిక పలు సూచనలు చేసింది. కవి, కవితా సందర్భం, వస్తువుకు సంబంధించిన ఆలోచన, అనుభవం, కవితలోని పదబంధాలు, భావచిత్రాలు, అలంకారాలు గుర్తించి విశ్లేషించాలి. ఈమేరకు ప్రరవే తెలంగాణ శాఖ అధ్యక్షురాలు తిరునగరి దేవకీదేవి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ కార్యశాల వివరాలను వెల్లడించారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే), ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం సంయుక్త నిర్వహణలో కళాశాల సెమినార్ హాల్‌లో ఈనెల 21న కవిత్వ విమర్శ- ఒక రోజు కార్యశాల ను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వర్క్‌షాప్ నిర్వహించబడుతుందని, ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీ.వెంకటేశ్వరరెడ్డి, ఆత్మీయ అతిథులుగా వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, కార్యశాల కన్వీనర్ డాక్టర్ రమేష్, వేదిక కార్యదర్శి కాత్యాయనీ విద్మహి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా కవి సీతారాం వ్యవహరిస్తారని, సాయంత్రం నిర్వహించే ముగింపు సమావేశానికి ప్రరవే వేదిక సమన్వయకర్త డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ప్రముఖ కవులు మువ్వా శ్రీనివాసరావు, ప్రసేన్, వంశీకృష్ణలతో పాటు స్థానిక కవులు, రచయితలు ఈ కార్యశాలలో పాల్గొంటారని తెలిపారు. సమన్వయకర్తగా మానస ఎండ్లూరి వ్యవహరించే ముగింపు సమావేశానికి అతిథులుగా లక్ష్మీనరసయ్య, డాక్టర్ బీ.వెంకటేశ్వరరెడ్డి హాజరవుతారన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles