ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దాం..

Sun,July 21, 2019 12:19 AM

ఖమ్మం లీగల్, జూలై 20 : ర్యాగింగ్‌కు పాల్పడితే వచ్చే క్షణికానందం.. మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుందని జిల్లా న్యాయమూర్తులు విద్యార్థులకు ఉపదేశం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ ఆదేశాల మేరకు శనివారం ఐదు కళాశాలల్లో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి వినోద్‌కుమార్ మమత మెడికల్ కాలేజీలో సదస్సు నిర్వహించి ర్యాగింగ్‌తోపాటు ఇతర చట్టాలను వివరించారు. ర్యాగింగ్ నేరమని, దాని చర్యల తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా విద్యార్థులకు ఆరు నెలల నుంచి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మరి ఏ ఇతర కళాశాలలో చేర్చుకోరని, తద్వారా వారి జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ సివిల్ జడ్జి సీ విక్రమ్ సదస్సు నిర్వహించి, ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌ను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోని యాజమాన్యాలు కూడా ఈ చట్టం కింద శిక్షార్హులేనన్నారు. ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జ్యుడీషియల్ ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ఎం ఉషశ్రీ సదస్సు నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులు ఒకరితో ఒకరు సౌభ్రాతృత్వ భావనలో మెలగాలన్నారు. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జీవీ మహేశ్‌నాథ్ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కాలేజీలోగానీ సంబంధిత హాస్టళ్లు, బస్సులు, భోజనశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడటం నేరమన్నారు.

శాంతినగర్ కళాశాలలో న్యాయమూర్తి షేక్ మీరా ఖాసీం సాహెబ్ ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి విద్యార్హత పత్రాలపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ప్రత్యేకంగా రాస్తారని, దానివల్ల చట్టాన్ని ఉల్లంఘించిన ఆ విద్యార్థి జీవితం పాడవుతుందన్నారు. ర్యాగింగ్‌తో శతృత్వం పెరగడమే కాకుండా అందమైన కాలేజీ రోజులు పీడకలలా మిగిలిపోతాయన్నారు. అందుకే కాలేజీల్లోనుంచి ర్యాగింగ్ అనే భూతాన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయసేవాసంస్థ రూపొందించిన ర్యాగింగ్ నేరాలు - శిక్షలు అనే స్టిక్కర్లను పంపిణీ చేశారు. వాటిని కళాశాలలు, బస్సులు, హాస్టళ్లలో అతికించాలని కోరారు. దీనివల్ల విద్యార్థులు ర్యాగింగ్ అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని న్యాయమూర్తులు అన్నారు. ర్యాగింగ్ బాధిత విద్యార్థులు న్యాయసేవాసంస్థకు కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరిస్తూ సంస్థ ఫోన్ నెంబర్ (08742-222766), ఈ మెయిల్ అడ్రస్ ([email protected]) ను స్టిక్కర్లపై పొందుపర్చారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో న్యాయవాదులు వై శ్రీనివాసరావు, పీ పద్మావతి, శిరీష, పీ సంధ్యారాణి, ఇమ్మడి లక్ష్మీనారాయణ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్మోహన్‌రావు, ఆయా కళాశాలల అధ్యాపకవర్గం పాల్గొన్నారు.

185
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles