ఖమ్మం జిల్లా వైద్యసిబ్బందిని ఆదర్శంగా తీసుకోవాలి..

Sat,August 10, 2019 04:06 AM

మయూరి సెంటర్, ఆగస్టు 9: జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేస్తున్న వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సేవలను ఇతర జిల్లాల వైద్యాధికారులు, వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ జయరామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి కాన్పు సాధారణ ప్రసవం దిశగా సిబ్బంది నిర్వహింపచేస్తే రెండో కాన్పు కూడా సాధారణ ప్రసవం జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు జరిగిన ప్రభుత్వ వైద్యశాలల్లో మొదటి స్థానంలో జిల్లా వైద్యశాల ఉండటం సంతోషదాయకమన్నారు. జిల్లా డీసీహెచ్‌ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్ కృపా ఉషశ్రీ, వైద్యసిబ్బంది, మిడ్వైఫరీ కో-ఆర్డినేటర్ మేరిల కృషితో సాధారణ కాన్పులు నూటికి 70శాతం జరిగినట్లు రికార్డుల్లో ఉండటం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి చెందిన ఆర్‌ఎంవో, గైనకాలజిస్ట్, స్టాప్ నర్సులు ఇక్కడ అందుతున్న వైద్యసేవల పట్ల అవగహణ కార్యక్రమాన్ని నిర్వహింపచేసి వైద్యసేవల పట్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవేర్‌నెస్‌ను కల్పించి ఖమ్మం జిల్లా వైద్యబృందం సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నూటికి నూరు శాతం సాధారణ కాన్పులను పెంచి, సిజేరియన్‌లను (ఆపరేషన్‌లను ) పూర్తిగా తగ్గించి తల్లిబిడ్డల సంరక్షణకు పాటు పడాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్యశాల డీసీహెచ్‌ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాల నిర్వహణకు కృషి చేస్తున్నామని, సిజేరియన్‌ల శాతాన్ని తగ్గించేందుకు తమ సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్ కృపా ఉషశ్రీ, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, వైద్యులు ప్రసన్న జ్యోతి, మిడ్వైఫరీ కో ఆర్డినేటర్ మేరి, లేబర్ రూమ్ ఇన్‌చార్జి విజయలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles