ఆశల సాగు

Sat,August 10, 2019 04:10 AM

-వరద నీటితోనే నిండుతున్న రిజర్వాయర్లు
-శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. సాగర్ రిజర్వాయర్‌కు చేరుతున్న వరద నీరు
-ఈనెల 15 తరువాత ఎడమకాల్వకు నీరు విడుదల చేసే అవకాశం
-ఖమ్మంలో నిండిన చెరువులు-74, కొత్తగూడెంలో-957

ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్లకు సైతం జలకళ వచ్చింది. కాస్త ఆలస్యంగా నైనా వరుణ దేవుడు కరునించడంతో జిల్లా రైతాంగం ఊపిరి పీల్చుకుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విత్తన, ఎరువుల కొరత రాకుండాతీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు పెట్టుబడి సైతం ప్రభుత్వమే పెట్టడంతో రైతులు నూతన ఉత్సాహంతో సాగుకు శ్రీకారం చుట్టారు. అత్యధికంగా కామేపల్లి మండలంలో నేటి వరకు 560 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో అటు రైతులు, ఇటు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి ఏటా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నిండే రిజర్వాయర్లు ఈ సంవత్సరం వరద నీరుతోనే నిండుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగతుండటంతో భూగర్బజలాలపై చూపే అవకాశం ఉంది.

జిల్లాలో నిండుతున్న చెరువులు...
ఖమ్మం జిల్లాలోని మొత్తం 1487 చెరువులు ఉండగా ఇప్పటి వరకు 74 చెరువులు అలుగుపోస్తున్నాయి. 315 చెరువుల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు నీరు చేరగా, 330 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 423 చెరువుల్లో 25 నుంచి 50 శాతం, 345 చెరువుల్లో 25 శాతం వరకు నిండాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం చెరువులు 2396 ఉండగా వీటిలో 957 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 25 నుంచి 50 శాతం వరకు 77 చెరువుల్లోకి నీరు చేరగా, 50 నుంచి 75 శాతం వరకు 558 చెరువుల్లో నీరు చేరింది, మరో 804 చెరువుల్లో 75 నుండి 100 శాతం వరకు నిండాయి.

మరింత పెరగనున్న భూగర్భజలాలు
రెండేళ్లుగా జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతున్నాయి. ఇందుకు రెండు కారణాలుగా చెప్పవచ్చు. ఒకటి మిషన్‌కాకతీయ పథకం కాగా రెండోది పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టు. గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో దాదాపు 950 చెరువులలో మిషన్‌కాకతీయ పథకం ద్వార చెరువుల పూడికతీత పనులు జరిగాయి. దీంతో చెరువులకు దాదాపు 365 రోజుల పాటు జలకళ సంతరించుకునేందుకు దోహదం ఏర్పడింది. పాలేరు నియోజకవర్గంలో సైతం భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా నిరంతరం చెరువులలో నీరు ఉంటుండంతో బావులలో ఊటలు పుష్కలంగా ఉన్నాయి.

పదిరోజుల్లో సాగర్‌జలాలు విడుదల..
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేసి 1.06 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం మాదిరిగానే శ్రీశైలంకు వరద వస్తే కొద్ది రోజుల్లో నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశం ఉంది. కనుక ఎడమ కాల్వకు నీరు విడుదల చేస్తారు. ఈనెల 15 నుంచి 20వ తేదీలోగా ఎన్‌ఎస్‌పీ జలాలు మన జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలలోని పలు గ్రామాలు ఉన్నాయి. ఈ ఆయకట్టు ప్రాంతంలో దాదాపు 1.25 లక్షల హెక్టార్ల సాగుభూమి కలిగి ఉంది. వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లను నింపుకోవడం అనంతరం కాల్వల ద్వారా పొలాలకు నీరు అందించడం జరుగుతుంది.

వరిసాగుపై రైతులలో భరోసా..
ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 1.35 లక్షల హెక్టార్లలో వివిధ రకాలైన పంటల సాగు జరిగింది. ఈ సంవత్సరం ఈ సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి దాదాపు 2.30 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు జరగవచ్చని అధికారులు అంచన వేశారు. ప్రధానంగా పత్తి 97 వేలహెక్టార్లు, వరి సాగు మరో 60 వేల హెక్టార్లలో సాగు కావచ్చని అంచనా వేశారు. అధికారుల అంచనాకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు పునాస, పత్తి పంటల సాగు ఆశజనకంగానే జరిగింది. అయితే వరి విషయానికి వచ్చే సరికి ప్రతి సంవత్సరం వరి సాగు రైతులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరుపైనే ఆదారపడి సాగు చేసేవారు. అయితే ఇప్పటికే వచ్చిన వర్షాలకు ప్రాజెక్టు పరిదిలోని చెరువులు, పాలేరు, వైరా, లంకసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు రావడంతో రైతులకు పూర్తి భరోస కలిగినైట్లెంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు 600 హెక్టార్లలో వరినారు పోశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఆయా మండలాలో దాదాపు 800 హెక్టార్లలో వరినాట్లను సైతం వేసుకోవడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆలస్యంగా వరినాట్లు జరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles