సంరక్షించలి

Mon,August 12, 2019 12:20 AM

-అటవీ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకోవాలి
-పార్క్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తా..
-అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి..
-పార్క్ ప్రారంభోత్సవంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-హరితహారం బృహత్తర కార్యక్రమం.. : ఎంపీ నామా
-రోల్‌మోడల్‌గా అర్బన్ ఫారెస్ట్‌గా తీర్చిదిద్దుతా..: ఎమ్మెల్యే అజయ్

రఘునాథపాలెం, ఆగస్టు11: ఖమ్మం నగర ప్రజలకు అహ్లాదాన్ని అందించేందుకు విశాల ప్రాంగణంలో ఏర్పాటైన వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఖమ్మం జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ, దేవాదాయ మరియు న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 546ఎకరాల విస్తీర్ణం.. రూ.4కోట్ల వ్యయంతో శోభాయమానంగా తీర్చిదిద్దిన వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. ఖమ్మం ఎంపీనామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌లతో కలిసి మంత్రి ఈ పార్కును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. హైదరాబాద్‌ను ఏమాత్రం తీసిపోని విధంగా ఖమ్మం అభివృద్ధి జరుగుతోందన్నారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకొని నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకోవడంలోనూ ఖమ్మం ప్రజలు ముందుండాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు అటవీ సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ముంబై, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం అక్కడి ప్రజలు డబ్బులు చెల్లించి పార్కుల బాట పడుతున్నారన్నారు. అటువంటి దుస్థితి మన రాష్ట్ర ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో తెలంగాణకు హరితహారం పేరుతో ఊరూరా మొక్కలు నాటే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారన్నారని వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా 230కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. గత నాలుగు విడతల్లో చేపట్టిన హరితహారంలో 113కోట్ల మొక్కలను నాటామన్నారు. 5వ విడతలో 83లక్షల మొక్కలను నాటుతున్నట్లు వివరించారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయన్నారు. హరితహారం ద్వారా చేపట్టిన మొక్కలు పెంపకంతో దేశంలో మొక్కలు పెంచే రాష్ట్రంగా తెలంగాణకు 5వ స్థానం దక్కిందన్నారు. ఈ భూమిపై జీవించే సమస్త జీవకోటి మనుగడ చెట్లపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. బెంగళూరు, చంఢీఘర్ వంటి రాష్ర్టాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచితేనే లభిస్తుందన్నారు. ఇదే విధానాన్ని ఖమ్మంలోనూ పాటించాలని నగరపాలక అధికారులకు మంత్రి సూచించారు. ఖమ్మానికి మణిహారంగా తీర్చిదిద్దిన లకారం ట్యాంక్‌బండ్ అభివృద్ధి ఘనత ఎమ్మెల్యే అజయ్ కుమార్‌దేనని మంత్రి పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతలను సైతం అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు. అదే క్రమంలో ఎకో టూరిజం పైనా దృష్టి సారించాలన్నారు. పుణ్యక్షేత్రాన్ని కలిగి ఉన్న భద్రాద్రి రాముని చలువతో ఖమ్మం మరింత అభివృద్ధ్దిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్‌ను మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తప్పక అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ముందుగా పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మంత్రి అటవీక్షేత్రం మొత్తం కలియ తిరిగి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పాత్ వే, చిల్డ్రన్స్ ఆట స్థలాలను పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఫారెస్ట్ పార్క్‌లో పలు మొక్కలను నాటారు. ముందుగా తెలంగాణ సాంస్కృతి కాళాకారులు చేపలమడుగు కోటేశ్వరరావు బృందం చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వినర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి, అటవీశాఖ అధికారులు సీఎఫ్ రాజారావు, డీఎఫ్‌వో ప్రవీణ, ఎఫ్‌డీఓలు ప్రకాశరావు, సతీష్ కుమార్, డిప్యూటీ ఆర్‌వో రేణుక, ఎఫ్‌ఆర్‌వోలు బి.రాధిక, పీ.సీతారామారావు, డీఆర్‌వో నాగమణి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, ఖమ్మం అర్బన్ మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు చేతుల నాగేశ్వరరావు, పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, చావా నారాయణరావు, టీఆర్‌ఎస్ నాయకులు తుల్లూరు బ్రహ్మయ్య, చిత్తారు సింహాద్రి, తొలుపూరి దానయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
నానాటికీ అంతరించిపోతున్న అటవీ సంపదను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం బృహత్తర కార్యక్రమం అని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. 20-30ఏళ్ల తరువాత భారతదేశంలో విపరీతమైన గాలి, నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల ఏర్పాటు అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకరావడం జరిగిందని ఎంపీ గుర్తు చేశారు. ఖమ్మం నగర ప్రజలకు అహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పార్క్ అభివృద్దికి ఎంపీ నిధుల నుంచి రూ.10లక్షలు కేటాయిస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles