చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం..

Mon,August 12, 2019 11:44 PM

-ఉచిత చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం..
-988 చెరువులు-3.79 కోట్ల చేప పిల్లలు
-ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన మత్స్యశాఖ
-13వేల కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం
-రిజర్వాయర్లు, చెరువులకు చేరుతున్న వదరనీరు

ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 12: ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ఆయా గ్రామాలలోని చెరువులు, రిజర్వాయర్‌లకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలాశయాల్లో జలకళ సంతరించుకుంది. ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జిల్లా మత్స్యశాఖ ఉచిత చేపపిల్లల పంపిణీకి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసింది. గత నెల రోజుల క్రితమే జిల్లా జలశయాలకు అనుగూణంగా ప్రణాళిక తయారు చేసిన సంబంధిత అధికారులు రాష్ట్ర మత్స్యశాఖకు ఇండెంట్ పంపించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆశాఖ రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలోని చెరువుల్లో నీటినిల్వల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రారంభం కానుంది. స్వరాష్ట్ర సాధనతో తెలంగాణలో కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చింది.

ఒక పక్క బీమా మొత్తాన్ని రూ. 6 లక్షలకు పెంచడమే కాకుండా చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలను అందించింది. వీటితో పాటు మత్స్య సొసైటీల బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సమగ్ర మత్స్యాభివృద్ధి పథకం ద్వారా జిల్లాలోని మత్స్యకార్మికులకు సుమారు రూ .33 కోట్ల విలువైన ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలు, లగేజీ వాహనాలు, అవుట్ లేట్లు, వలలు, తెప్పలు రాయితీపై అందించింది. 2016-17 సంవత్సరానికి గాను జిల్లాలోని మత్స్య సొసైటీలకు సుమారు 1.20 కోట్ల చేప పిల్లలను అందించింది. 2017-18 సంవత్సరంలో 3.78 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందించింది. 2018-19 సంవత్సరానికి గాను 712 చెరువలలో 3.8 కోట్ల చేపపిల్లలను ఆయా సొసైటీలకు అందించింది. ఈ ఏడాది 2019-20 సంవత్సరానికి గాను 988 చెరువులలో సుమారు 3.78 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని జిల్లా మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసింది.

జిల్లా మత్స్యశాఖ తీరు ఇలా..
జిల్లా వైశాల్యం, నీటి వనరులతో పోల్చుకుంటే మత్స్యసంపద జిల్లా వాసులకు తగ్గట్టుగానే ఉందని చెప్పవచ్చు. సాధారణంగా సగటున సంవత్సరానికి ప్రతి మనిషికి 8 నుంచి 12 కిలోల చేపల అవసరం ఉంటుందని నిపుణుల అంచనా. అయితే జిల్లాలో పుష్కలంగా వర్షాలు వస్తే ఏడాదికి ఏటా 20వేల టన్నుల మత్స్య ఉత్పత్తి అవుతోంది. జిల్లా మొత్తం మత్స్యపరిశ్రమపై ఆధారపడి 14.282 మంది కార్మికులు చేపల వేటను కొనసాగిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో177 సొసైటీలు ఉన్నాయి. సదరు మత్స్యకార్మికులు జిల్లాలో ఉన్న 194 చెరువులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీటితోపాటు పంచాయతీల పరిధిలో మరో 1,089 చెరువులు, కుంటలు ఉన్నాయి, అదే విధంగా పాలేరు, వైరా, లంకసాగర్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గణంకాల గణంకాల ప్రకారం రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో ఉమ్మడిజిల్లా 3వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. చెరువులు 17,039 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండగా, పంచాయతీల పరిధిలో ఉన్న కుంటలు మరో 8,867 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. జిల్లాలో సరాసరి సగటున సంవత్సరానికి 20 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. వీటితో పాటు జిల్లాలో కేజ్‌కల్చర్ సాగుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles