బీటీపీఎస్‌కు కోల్ ట్రాన్స్‌పోర్టుకు లైన్ క్లియర్..!

Wed,August 14, 2019 01:00 AM

-మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు రోడ్డు మార్గాన బొగ్గు రవాణా..
మణుగూరు, నమస్తేతెలంగాణ, ఆగస్టు13: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రప్రభుత్వం మణుగూరు-పినపాక మండలాల్లో నిర్మిస్తున్న (270x4)1080 మెగావాట్ల సామర్థ్యంగల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్)కు మణుగూరు ఏరియా నుంచి బొగ్గు రవాణ చేయనున్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోడ్డు మార్గాన బొగ్గు రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. పనులన్నీ త్వరాగా పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జెన్కో, భేల్ అధికారులు పక్కా ప్రణాళికతో వేగంగా ముందుకు వెళుతున్నారు. మొదట 270 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తొలి దశ యూనిట్‌ను వచ్చే నెలలోనే విద్యుత్ గ్రీడ్‌కు అనుసంధానించాలని తెలంగాణ జెన్కో సన్నాహాలు చేస్తుంది. మణుగూరు ఏరియా నుంచి రోడ్డు మార్గాన బొగ్గు రవాణాకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లభించింది. బీటీపీఎస్ చీఫ్ ఇంజనీరు పీ.బాలరాజు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఒకొక్కటి 270 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 4 యూనిట్ల (1080 మెగావాట్ల) థర్మల్ కేంద్రాన్ని రూ. 7,400కోట్లతో నిర్మించాలని నిర్ణయించిన జెన్కో నాలు సంవత్సరాల కిందటే బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. ఈ ప్లాంట్‌కు సింగరేణి కాలరీస్ బొగ్గు కేటాయింపు జరిగింది. మణుగూరు ఏరియా మల్లేపల్లి ఓపెన్‌కాస్ట్, మణుగూరు ఓపెన్‌కాస్ట్-4 నుంచి బొగ్గు రవాణాకు అనుమతి లభించినట్లు తెలిసింది. కొత్తగా బీటీపీఎస్ వరకు దూరం 17 కీ.మీ రైల్వేలైన్ నిర్మాణం కోసం భూసర్వే పూరైంది. ఇందు కోసం ఇంకా భూసేకరణ జరుగుతోంది. మణుగూరు రైల్వే స్టేషన్ నుంచి లైను నిర్మాణానికి ఇంకా సమయం పట్టనుంది. అప్పటి వరకు రోడ్డు మార్గంలో బీటీపీఎస్‌కు బొగ్గు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి జెన్‌కో విన్నవించింది. ప్రతి సంవత్సరం 4.2 మిలియన్ టన్నుల బొగ్గును బీటీపీఎస్‌కు అవసరం ఉంటుంది. ప్రతిరోజూ సుమారు 15వేల టన్నుల వరకు రోడ్డు మార్గం ద్వారా మణుగూరు ఏరియా నుంచి బొగ్గు ట్రాన్స్‌పోర్టు కానుంది. వచ్చే నెల నుంచి కోల్‌టాన్స్‌పోర్ట్ ప్రారంభించనున్నట్లు బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు మంగళవారం తెలిపారు. ఈ క్రమంలోనే ప్లాంట్ పనుల వేగం పెంచారు. త్వరగతిన పనులు పూర్తయ్యేందుకు జెన్కో, భేల్ అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మొదటి యూనిట్‌లో సెప్టెంబర్‌నెలలో పనులన్నీ పూర్తిచేసి కమర్షియల్ ఆపరేషన్ డే(సీవోడీ) నిర్వహించేందుకు జెన్కో, భేల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీవోడీ ప్రక్రియకు వెళ్లిన తర్వాత గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు.

118
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles