మున్నేరు మురువంగ..!

Wed,August 14, 2019 01:03 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ : వృథాగా పోతున్న నీళ్లను ఒడిసిపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ప్రతిఫలం దక్కుతున్నది. ప్రతీ నీటి చుక్కను భద్రపరిచే ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో వరంగల్, ఖమ్మం మీదుగా ప్రవహిస్తున్న మున్నేరు నది నీటిని బీడు భూములకు మళ్లీంచాలని సంకల్పం నేరవేరింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, పొలిశెట్టిగూడెం వద్ద మున్నేరువాగుపై చెక్‌డం కం వంతెన నిర్మాణాలు పూర్తి చేశారు. దీంతో మున్నేరు నది జలకళతో ఉట్టిపడుతోంది. కనుచూపు మేరలో వరద నీరు నిల్వ ఉండడంతో ఆయకట్టు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే బీడు భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి.

వృథాగా మున్నేరు నీరు..
సీమాంధ్ర పాలనలో నదిజలాలపై నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణలోని భూములన్నీ బీడు భూములుగా మారాయి. అమూల్యమైన కృష్ణజలాలు తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రాకు తరలిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు సుప్రీంకోర్టు తలుపుతట్టిన తెలంగాణ ప్రభుత్వం మరోవైపు వృథా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

కృష్ణనదికి ఉపనదులుగా ఉన్న మున్నేరులో నీళ్లు వృథాగా ఆంధ్రా వద్ద కృష్ణనదిలో కలుస్తున్నాయి. ఈ వృథా నీటిని నిల్వ చేసేందుకు మున్నేరుపై డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వరంగల్ జిల్లా పాఖాలలో పుట్టే మున్నేరు నది వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోనే 140కిలోమీటర్ల ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఏపీలోని కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నందిగామ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. దీని ఉపనది అయిన ఆకేరు 120 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. మిగిలిన ఉపనదులు 40కిలోమీటర్ల మేర ప్రవహిస్తాయి. ఇలా మున్నేరు, దాని ఉపనదుల ప్రవాహం నీటిపై పది మినీ ఆనకట్టలు ఉన్నాయి. ఇంకా 50కి పైగా ఆనకట్టలు కట్టాలని ప్రభుత్వ సర్వేలో తేలింది. అందులో భాగంగానే అందులో భాగంగానే మున్నేరు, ఆకేరులపై సాధ్యమైనన్ని చెక్‌డ్యాం కం వంతెనలు నిర్మించేందుకు బడ్జేట్‌లో నిధులు కేటాయింపులు జరిగాయి. మరో 20 ఎత్తిపోతల పథకాలను మున్నేరు, ఆకేరులపై ఆనకట్టల నిర్మాణం పూర్తయితే దాదాపు ఖమ్మం, వరంగల్ జిల్లాలో చాలా భూములు సాగులోకి రానున్నాయి.

తీర్థాల, పొలిశెట్టిగూడెం గ్రామాల వద్ద డ్యాంల శ్రీకారం..
ఒకప్పుడు రూరల్ మండలం తీర్థాల పరిసర ప్రాంతం ఏప్పుడు కూడ తాగు, సాగునీటితో అలమటించేది. ఎంతమంది ప్రజాప్రతినిధులు మారిన ఈ ప్రాంత పరిస్థితి మారలే..అటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కృషితో తీర్థాల, పొలిశెట్టిగూడెం వద్ద మున్నేరుపై సుమారు రూ.32కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం కం వంతెనలు నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ చెక్‌డ్యామ్‌ల వలన సుమారు 3వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రావడంతో పాటు తీర్థాల, కామంచికల్లు, పొలిశేట్టిగూడెం, మద్దివారిగూడెం ముత్యాలగూడెం, జాన్‌బాద్‌తండా, మల్లెలమడుగు, పాపటపల్లి గ్రామాల్ల్లో భూగర్భజలాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎన్నో సార్లు మున్నేరుపై చెక్‌డ్యాంలు నిర్మించాలని పలు పార్టీలు విన్నవించిన అప్పటి పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తుమ్మల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపటడంతో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు చెక్‌డ్యాంల నిర్మాణానికి మోక్షం లభించింది. శరవేగంగా ఈ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. చెక్‌డ్యామ్ నిర్మాణాలు పూర్తికావడంతో ఈ రెండు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి తుమ్మల కృషితోనే..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఈ ప్రాంతంలో రెండు చెక్‌డ్యామ్ కం వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని వలన తీర్థాల, కామంచికల్లు, ముత్యాలగూడెం, పాటివారిగూడెం, జాన్‌బాద్‌తండా, పోలిశేట్టిగూడెం, మద్దివారిగూడెం మల్లెలమడుగు గ్రామాలకు తాగునీరుతో పాటు సాగునీటికి ఢోకా ఉండదు. గ్రామ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి తుమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు. - తేజావత్ బాలునాయక్, తీర్థాల సర్పంచ్

హర్షించదగినది..
మున్నేరు, ఆకేరులపై ఆనకట్టల నిర్మాణం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. గతంలో పాలించిన పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణలో భూములు బీడు భూములుగా మారాయి. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది. అందులోభాగంగానే ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు, ఆకేరుపై చెక్‌డ్యామ్‌లు నిర్మాణం చేశారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సహకారంతో పెండింగ్‌లో ఉన్న చెక్‌డ్యామ్‌లను పూర్తి చేస్తాం.
- బెల్లం ఉమ, రూరల్ ఎంపీపీ

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles