ఎత్తిపోతల పథకాలపై అవగాహన కలిగి ఉండాలి

Sat,August 17, 2019 12:20 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రైతు శ్రేయస్సే ధ్యేయంగా, సకల సౌకర్యాలు కల్పించి రైతుల ఆర్థికాభివృద్దికి చేయూతనివ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఎత్తిపోతల పథకముల సుస్థిర యాజమాన్యంపై సమగ్ర అవగాహనకై రైతు చైతన్య సదస్సులపై ఎత్తిపోతల పథకాల నిర్వహణలో పాటించవలసిన మెలకువలపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లిప్ట్ ఇరిగేషన్ స్కీంల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాదక బాధకాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోలని తెలిపారు. రైతులు ఎత్తిపోతల పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నీటి పారుదల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి రైతులకు చేయూతనందివ్వాలన్నారు. రైతులకు బహుళ ప్రయోజనం కల్పించాలన్న దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటైనందున వారికి పథకాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, రైతుకు వ్యవసాయం, పంట విలువ తెలుస్తుందని కాబట్టి చిన్నచిన్న పైపులైన్ మరమ్మతుల పనులు సంబంధిత శాఖలు పూర్తిచేస్తాయని కలెక్టర్ తెలిపారు.

ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపడం జరుగుతుందో అక్కడ మత్స్య సహకార సంఘాల నుంచి కొంత మొత్తాన్ని సమకూర్చడం జరిగుతుందని తెలిపారు. మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. జిల్లాలో 137 స్కీంలు అమలవుతుండగా, వీటిలో రైతులచే 69 స్కీంలు నిర్వహింపబడుతున్నాయని తెలిపారు. లక్షల రూపాయలతో నిర్మించిన స్కీంలను సంస్థ రైతులకు అప్పగిస్తున్నదని వాటిని విజయవంతంగా నిర్వహించుకొని రైతులు వృద్ధిలోకి రావలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎత్తిపోతల పథక వ్యవస్థ తమ సొంత ఆస్తిగా భావించాలన్నారు. నీటి సరఫరా ప్రణాళిక రైతులందరూ సమిష్టిగా చర్చించుకొని నీటి పంపిణీని సక్రమంగా పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. వైరా రిజర్వాయర్ పరిధిలోని చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రైతు దేశానికి వెన్నెముక అని, అది ఎన్నిటికి బలహీనం కావద్దన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.

స్కీం ప్రభుత్వమే నిర్మించి, ఉచిత కరెంటుతో అందిస్తుందని వాటి నిర్వహణ బాధ్యత సమర్థవంతంగా ఉండాలని ప్రస్తుతం ఉన్న 137 స్కీంల్లో ఇబ్బందులు ఎదురయినట్లయితే అక్కడ రైతులను కలిసి కారణాలు తెలుసుకొని సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. తద్వారా ఖమ్మం జిల్లా రైతులు రాష్ట్రంలో తలమానికంగా నిలువాలన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి నర్సింహారావు, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విద్యాసాగర్, రైతులు సమావేశంలో పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles