పల్లె వికాసం

Sat,August 17, 2019 12:26 AM

-నూతన పంచాయతీ రాజ్ చట్టంతో పలు సంస్కరణలు
-అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచే దిశగా అడుగులు
-60 రోజుల ప్రత్యేక కార్యాచరణకు కసరత్తు
-జిల్లాలో 584 పంచాయతీల్లో ప్రణాళికల రూపకల్పన
-విద్యుత్ సమస్యలకు చెక్‌పెట్టే దిశగా ప్రయత్నం
-పాలనలో పారదర్శకత
-అధికారుల్లో జవాబుదారీతనం
-నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్న ప్రజలు

(ఖమ్మం, నమస్తే తెలంగాణ)సాధారణ ప్రజలు మున్సిపల్ , రెవెన్యూ కార్యాలయాలకు ఏ ఏదైనా పనిమీద వెళ్లి మామూళ్లు ముట్ట చెప్పనిదే పనులు కాని పరిస్థితి ఉంది. దీని వల్ల అధికారుల్లో జవాబుదారీ తనం లోపించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రజలకు బాధలు తప్పడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం చట్టాలను మారుస్తోంది. ఇప్పటికే కొత్త పంచాయతీ రాజ్ చట్టం మన్ననలు పొందుతోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా పలువురు రెవెన్యూ ఉద్యోగ నేతలు, ప్రజలు స్వాగతిస్తున్నారు.

60 రోజుల్లో మార్పు..
జిల్లాలో నూతన పంచాయతీ రాజ్ చట్టం ఏర్పాటాయ్యాక అంతకు ముందు ఉన్న 417 గ్రామ పంచాయతీలకు అదనంగా 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 584 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. ఇప్పటికే ఆయా పంచాయతీలలో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కూడా ఇచ్చింది. నిధుల వినియోగంలో పారదర్శకత పెరిగినట్లయింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 60 రోజుల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. దీంతో ఆయా గ్రామాల పాలక వర్గాలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకంలో ప్రణాళికలను రచిస్తున్నాయి. 60 రోజుల కార్యాచరణకు సిద్ధమయ్యాయి.

ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు..
జిల్లాలో పల్లె సీమల అభివృద్ధి కోసం 60 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించునున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడం, వాటి సంరక్షించడం వంటి పనులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయనున్నారు. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి సామాజిక సనులు చేసేలా అడుగులు వేయించనున్నారు. శ్మశాన వాటికల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేసి ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక శ్మశాన వాటిక నిర్మించనున్నారు. గ్రామ ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలు, వాటి కోసం చేయాల్సిన పనులు, నిధుల సమీకరణ వంటి విషయాలను గ్రామ ప్రణాళికలో పొందుపర్చనున్నారు. గ్రామం అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.

కమిటీల్లో సీనియర్ సిటిజన్లు..
గ్రామ పంచాయతీల్లో గుణాత్మక మార్పు కోసం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి గ్రామంలో వీధి దీపాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, వంద శాతం పన్నులు వసూలు పక్కాగా నిర్వహించేందుకు ప్రత్యేక స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గ్రామ పంచాయతీ పాలకవర్గంతోపాటు గ్రామ కార్యదర్శి పాత్ర కీలకంగా ఉండనుంది. యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్లను ఆయా కమిటీల్లో భాగస్వాములను చేయనున్నారు. పనులను పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్కాడ్‌లను సైతం నియమించనున్నారు. ఈ ప్లయింగ్ స్కాడ్‌లు గ్రామాల్లో పనులను, వాటి అమలు తీరును పర్యవేక్షిస్తారు. సమస్యల పరిష్కారంతోపాటు పచ్చదనం, పరిశుభ్రత, శ్మశాన వాటికల ఏర్పాటు, డంపింగ్ యార్డుల ఏర్పాటు వంటి వాటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles