ఖమ్మానికి పర్యాటక శోభ..

Mon,August 19, 2019 01:28 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ : ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పర్యాటక ప్రాంతంగా వర్ధిల్లుతుంది. ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక కృషి కారణంగా లకారం ట్యాంక్ బండ్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. లకారం అందాలు హైద్రాబాద్ హుస్సేన్‌సాగర్‌ను మైమరిపిస్తోంది. ఇక్కడ ఉన్న బోటింగ్, 100 అడుగుల జాతీయపతాకం, సెల్ఫీ పాయింట్, వాకింగ్ ట్రాక్, పార్క్, సెంట్రల్ లైటింగ్ తదితర సౌకర్యాలు నగర ప్రజలకు అహ్లాదాన్ని అందించడంతో పాటు ఆనందాన్ని కల్పిస్తున్నాయి. నగరానికి వచ్చే ప్రజలతో పాటు నగర ప్రజలు వారంతపు సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి ఆనందంగా గడిపేందుకు లకారం ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఖమ్మం నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న నగరానికి తెలంగాణ ఏర్పడ్డాక ప్రస్తుతం ఉన్న ఖమ్మానికి పూర్తి వ్యత్యాసం ఉంది. ఐదేళ్ల క్రితం వేరే ప్రాంతానికి వెళ్లి ఇప్పుడు ఖమ్మం వచ్చిన వారు ఇది నిజంగా ఖమ్మమేనా ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఒక నాడు ఇరుకైన రోడ్లు, మురిక కాలువలు, వెలగని లైట్లతో ఉన్న నగరం నేడు అర్ధరాత్రి పట్టపగలును తలపిస్తుంది. వైరారోడ్, బైపాస్ రోడ్డు, ఇల్లందురోడ్, బోనకల్ రోడ్, కాల్వొడ్డు, ఎఫ్‌సీఐ రోడ్, కస్బాబజార్, ఎన్‌ఎస్‌టీ రోడ్, డీఆర్‌డీఏ రోడ్ తదితర రోడ్లను విస్తరించడంతో పాటు డివైడర్లను నిర్మించి అందంగా తీర్చిదిద్దారు. డివైడర్ల మధ్యలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లే లైట్లను ఏర్పాటు చేశారు. కాల్వొడ్డు, ఇల్లందు క్రాస్‌రోడ్, శ్రీశ్రీ విగ్రహం, గాంధీచౌక్ ,ఎన్టీఆర్ మార్గ ప్రాంతాలలో ఫౌంటేన్లు, సర్కిళ్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళలో కాల్వొడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్ , గాంధీచౌక్ ల వద్ద ఉన్న ఫౌంటేన్లు అందంగా, అద్భుతంగా ఉండటంతో వాటి దగ్గర సెల్ఫీలు దిగే వారి సంఖ్య రోజురోజకు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించడం, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇదంతా ఒక భాగమైతే ఖమ్మం నగరానికి తూర్పు వైపున లకారం చెరువు నగరానికి మరో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరజిల్లేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా...
ఖమ్మం నగర ప్రజలు వారాంతం రోజుల్లో కాని, పండుగ సందర్భాల్లో కానీ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా, సంతోషంగా గడిపేందుకు సరైన ప్రదేశం లేక నగర ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలం నుంచి సీక్వెల్ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు, ట్యాంక్ బండ్ వద్దకు ప్రజలు రావడం, కటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో ఆనందంగా గడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఖమ్మం నగరంలో హోటళ్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటం జరిగింది. ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో నగర ప్రజలు ఉన్నందున ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌లు లకారం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ట్యాంక్ బండ్ ఏ విధంగా అందుబాటులో ఉందో ఖమ్మంలోని లకారం చుట్టూ కూడా అదే విధమైన ట్యాంక్ బండ్‌ను నిర్మించారు.

ఖమ్మంకే ఐకాన్‌గా నిలిచిన 100 అడుగుల జాతీయపతాకం...
ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన 100 అడుగుల జాతీయపతాకం ఖమ్మం నగరానికి ఐకాన్‌గా నిలిచింది. హైద్రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అత్యంత ఎత్తైన జాతీయపతాకం మాదిరిగానే ఖమ్మం లకారంపై కూడా ఎమ్మెల్యే అజయ్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.

నాడు బురదమయం..
ఖమ్మం నగరానికి తూర్పు వైపున ఒక నాడు 164 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లిన లకారం చెరువు ఆక్రమదారుల చెరలో నలిగి పోయింది. గత జిల్లా కలెక్టర్ల చొరవ కారణంగా లకారం చెరువు భూముల్లోనే టీటీడీసీ, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, అంబేద్కర్ భవనం నిర్మించారు. ఆ తర్వాత మరికొంత భూమిని సీక్వెల్ రిసార్ట్స్ పర్యాటక అభివృద్ధి కోణంలో కేటాయించారు. ఇప్పుడు దాదాపు 118 ఎకరాల విస్తీర్ణంలో లకారం చెరువు ఉన్నది. ఒక నాడు వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన లకారం గత పాలకుల పుణ్యమా అని మురికికూపంగా మారింది. నగరంలో టూటౌన్ ప్రాంతానికి సంబంధించిన మురికి కాలువలన్నీ లకారంలోనే కలిసిపోయి ఒక పెద్ద మురికి చెరువుగా తయారైంది. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను అభివృద్ధి పరిచే లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫేజ్-1 పథకంలో లకారం చెరువుకు ఆధునీకరణకు రూ. 13.5 కోట్లను కేటాయించింది. లకారంలోకి వచ్చే మురికి కాలువను పక్కకు మళ్లించారు. మురికి కాలువకు, చెరువులో ఉన్న నీటిని కలువకుండా మధ్యలో కట్టపోసి రెండింటిని వేరు చేశారు.

నేడు సుందరంగా..
118 ఎకరాల లకారం చెరువు చుట్టూ కట్టను నిర్మించి మొత్తం పనులను ఆధునీకరించారు. 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్‌ను తొలగించారు. చెరువు చుట్టూ 3 లక్షల క్యూబిక్ మీటర్ల కట్టను నిర్మించారు. 15 మీటర్ల వెడల్పుతో మెయిన్ కట్టను నిర్మించారు. ఇది ఈ కట్ట మమత రోడ్ నుంచి సీక్వెల్ వరకు కిలో మీటర్ దూరం ఉంటుంది. దీంతో పాటు చుట్టూ 11 మీటర్ల వెడల్పుతో 1500 మీటర్ల వరకు కట్టను నిర్మించారు. ఇదికాకుండా చెరువు లోపలవైపు రాయితో కట్టుబడి చేశారు. చెరువు చుట్టూ ఇనుప కడ్డీలపై పెన్సింగ్ చేశారు. చెరువులోపల 15 అడుగుల లోతు నీరు ఉంటుంది. ఈ చెరువులో 30 ఎంసీఎఫ్‌లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 2.30 కోట్ల వ్యయంతో చెరువు చుట్టూ నాలుగు చోట్ల బ్రిడ్జిలను నిర్మించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 13.5 కోట్లతో చెరువు ఆధునీకరణ చేయగా రాష్ట్ర ప్రభుత్వం చెరువు సుందరీకరణకు మరో రూ. 4 కోట్లను కేటాయించింది. వీటి ద్వారా చెరువు చుట్టూ రెయిలింగ్, మెయిన్ రోడ్డుకు గడ్డి, టైల్స్, వాకర్స్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, గేట్లు, నాలుగు చోట్ల గజబోస్‌లు, కాకతీయ కళాతోరణం, ఎంట్రన్స్ గేటు, గార్డ్ రూమ్, టాయిలెట్లు, హోటల్, బోటింగ్ తదితర సౌకర్యాలను నిర్మించారు.

గజబోస్ నిర్మాణం...
పెద్ద పెద్ద నగరాలు, పర్యాటక ప్రాంతాలకే పరిమితమైన గజబోస్‌లు నేడు ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. లకారం చెరువు చుట్టూ నాలుగు గజబోస్‌ను నిర్మించారు. వీటి నిర్మాణానికి కలకత్తా నుంచి ప్రత్యేక నిపుణులైన కార్మికులను రప్పించి వీటిని నిర్మించారు. వీటిని చూసే నిజంగా ఇక్కడ చెట్టు మొలిచి వాటిని కత్తిరించారా అన్న రూపంలో ఉంటాయి. కూర్చోవడానికి చుట్టూ బెంచీ వచ్చి గుడిసె మాదిరిగా పైకప్పును ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వీటి మధ్యలో విద్యుత్ లైట్లను అమర్చారు. రాత్రి పూట నిజంగా ఇది ఖమ్మమే అనిపించే రీతిలో వీటిని నిర్మించడం జరిగింది.

వృద్ధులకు బ్యాటరీ కారు...
ఖమ్మం నగరానికి చెందిన వృద్ధులు సాయంత్రం, ఉదయం వేళల్లో లకారం చెరువు వద్దకు వచ్చి సేద తీరే అవకాశముంది. వీరికి బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు సైక్లింగ్ చేసే వారికి ఇంటి వద్ద నుంచి సైకిళ్లు తెచ్చుకోకుండా ట్యాంక్‌బండ్ వద్దే 20 సైకిళ్లను ఏర్పాటు చేశారు. బోటింగ సౌకర్యాన్ని కల్పించారు. ప్రతి రోజు వచ్చే పర్యాటకులతో ట్యాంక్ బండ్ అందాలు విరజిల్లుతున్నాయి,

మత్స్యకారులకు ఉపాధి...
ఎన్నో ఏళ్ల నుంచి లకారం చెరువుపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు గత పాలకుల పుణ్యంగా మారిన లకారం వైపు చూసిన పాపాన పోలేదు. ఆ చెరువుపై ఉపాధిని కొన్నేళ్లపాటు వదులుకున్నారు. అలాంటిది మిషన్ కాకతీయలో చెరువు అభివృద్ధి చేయడం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని మళ్లించి చెరువు నింపడం ద్వారా తిరిగి వారికి ఉపాధి దొరికినైట్లెంది. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్యే అజయ్‌కుమార్ చొరవ కారణంగా గతం నుంచి ఆ చెరువుపై ఆధారపడిన మత్స్యకారులే తిరిగి ఉపాధిని కల్పించారు. చేపల పెంపకాన్ని చేపట్టారు. దీని ద్వారా మత్స్యకారులకు ఉపాధి దొరకడంతో పాటు చెరువులో నాచు పెరగకుండా, వ్యర్థాలు లేకుండా ఉండే అవకాశముంది.

ఖమ్మాన్ని రోల్డ్ మోడల్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం...
-పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నియోజకవర్గాన్ని రోల్డ్ మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. వేల కోట్ల రూపాయలతో నగరంలో రహదారులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. తద్వారా వ్యాపార అభివృద్ధికి కృషి చేశాను. లకారం ట్యాంక్ బండ్‌ను మరింత అభివృద్ధి చేస్తాను. మిని శిల్పారామంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాను. ఖమ్మం ప్రజలకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాను. బోటింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. వాకర్స్‌కు వీలుగా ఉండేలా ట్రాక్‌ను ఏర్పాటు చేశాం. హరితహారంలో మొక్కలు నాటాం. ప్రతి ఒక్కరు కుటంబం మొత్తంగా వచ్చి సెలవు రోజుల్లో, సాయంత్రం వేలలో ఆనందంగా గడిపేందుకు వీలుగా ఉండే అన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశాం.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles