రేషన్ షాపుల్లో..ఈ-సేవ

Tue,August 20, 2019 12:23 AM

-టీ - వ్యాలెట్ ద్వారా అందనున్న సదుపాయాలు
-అన్ని రకాల పన్నులు చెల్లించే వెసులుబాటు
-జిల్లా వ్యాప్తంగా 669 రేషన్ దుకాణాలు
-నెలంతా తెరచుకోనున్న రేషన్ దుకాణాలు
-అక్టోబర్‌లో డీలర్లకు శిక్షణ ఇస్తాం: ఖమ్మం డీఎస్‌ఓ

(ఖమ్మం, నమస్తే తెలంగాణ)రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసింది. సెఫ్టెంబరు నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువులతోపాటు ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని సేవలనూ గ్రామీణ ప్రజలకు టీ-వ్యాలెట్ ద్వారా అందుబాటులోకి తేనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 669 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, చెక్కర వంటి నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు సరుకులను పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రజలు పట్టణాలకు వెల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అదనపు సేవలను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. రేషన్ దుకాణాల్లో ఈ-సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాలు మరిన్ని సేవలు పొందనున్నారు. అక్టోబర్ నుంచి రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేనున్న ఈ-సేవా కేంద్రాల ద్వారా గ్రామీణులకు బ్యాంకుల ద్వారా అందే సేవలతో పాటు ఆధార్, పరీక్షల ఫీజులు, పన్నుల చెల్లింపులతోపాటు ఇతర అన్ని సేవలనూ అనుసంధానం చేయనున్నారు. కామన్ సర్వీస్ సెంటర్లకు తోడుగా ఇకపై రేషన్ షాపుల్లోనూ టీ-వ్యాలెట్ అందుబాటులోకి రానుండటంతో గ్రామీణులకు, మహిళా సమాఖ్యలకు, స్వయం సహాయక గ్రూపులకు తిప్పలు తప్పనున్నాయి.

డీలర్ల ఆదాయం పెంచేందుకు..
పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ ద్వారా గతంలో అనేక రకాల సరుకులను పంపిణీ చేసేది. దీని ద్వారా డీలర్లకు ఆదాయం వచ్చేది. కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రేషన్‌షాపుల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ జరుగుతొంది. అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే కిలో చొప్పున పంచదారను ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో రేషన్ షాపులో అంత్యోదయ కార్డుదారులు 20 నుంచి 50 వరకు మాత్రమే ఉన్నారు.ఈ కొద్ది మందికి పంచదారను అందిస్తే మిగిలిన కార్డుదారులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అనేకమంది డీలర్లు పంచదారను తీసుకవెళ్లడంలేదు. కొన్ని చోట్ల కిరోసిన్ హాకర్లు లేని చోట డీలర్లకు కిరోసిన్ ఉన్న వారు మాత్రం బయోమెట్రిక్ మిషన్‌ల ద్వారా కిరోసిన్ సరఫరా చేసేవారు. ప్రస్తుతం కిరోసిన్ కూడా ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్ల ఆధాయం గణనీయంగా పడిపోయింది. గతంలో అందించే సరుకులు తగ్గి ఆదాయం లేకుండా పోయిందని ఆందోళన పడుతున్న రేషన్ డీలర్లకు ఈ-సేవల నిర్వహణను అప్పగించి ఆదాయాన్ని పెంచడంతోపాటు రోజంతా చేతినిండా పని కల్పించబోతున్నారు. రేషన్ దుకాణల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ-సేవల ద్వారా ప్రతి సేవకూ డీలర్లకు కమీషన్ రూపంలో కొంత ప్రభ్వుత్వం చెల్లించబోతోంది.

రేషన్ దుకాణాల్లో అందనున్న సేవలు..
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలూ ఈ- సేవా కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. కరెంటు బిల్లులు, ఇంటి పన్ను, ఆస్తి పన్నుల చెల్లింపు, బ్యాంకు ఖాతాల నగదు బదిలీ, రైల్వే, ఎయిర్, బస్ టికెట్ల బుకింగ్, మొబైల్ రీచార్జీ, డీటీహెచ్, ట్రాఫిక్ చలానాల చెల్లింపు, పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులు, ఆధార్‌కార్డుల్లో మార్పులు, గ్రామస్తులతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు తెరిపించడం, డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించడం, ఆసరా ఫించన్ల పంపిణీ, బ్యాంకు రుణాలు, రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, అటల్ పింఛన్ యోజన వంటి అనేక రకాల సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.

147
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles