తెలంగాణ అబ్బాయి.. కర్ణాటక అమ్మాయి..!

Fri,August 23, 2019 03:01 AM

కూసుమంచి: తెలంగాణ అబ్బాయి, కర్ణాటక అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో దండల పెళ్లి చేసుకున్నారు. కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన మర్రి మన్మథరావు, కర్నాటకకు చెందిన జ్యోతి... హైదరాబాద్‌లో న్యాయవాద విద్య అభ్యసిస్తున్నారు. వీరిద్దరూ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఉన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడిగా మన్మథరావు, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా జ్యోతి పనిచేస్తున్నారు. ఉద్యమ బాటలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా చిగురించింది.
అది మరింత బలపడి.. ప్రేమగా మారింది. ఒకే ఉద్యమం-ఒకే ఆశయంగా సాగుతున్న వారి పయనం.. పరిణయం దిశగా సాగింది. తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని తమ పెద్దలకు చెప్పారు. ఈ నిర్ణయాన్ని వారిద్దరి తల్లిదండ్రులు ఆమోదించారు.. హర్షించారు... ఆశీర్వదించారు. కూసుమంచిలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చట్టబద్ధంగా, స్థానిక ఫంక్షన్‌ హాలులో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. వీరి ఆదర్శ వివాహానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు సంగబత్తుల వెంకటరెడ్డి, మహ్మద్‌ మౌలానా, దండి సురేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు అశోక్‌ స్టాలిన్‌, శివరామకృష్ణప్రసాద్‌, క ళావతి, మన్మథరావు తల్లిదండ్రులు నాగమణి, వీరభద్రం, జ్యోతి తల్లి అమ్మాయమ్మ, స్థానిక నాయకులు మల్లేష్‌, మల్సూర్‌, గురువయ్య, యాదగిరి తదితరులు హాజరయ్యారు. జీవితాంతం ఆశయాల బాటలో ఆదర్శవంతంగా, ఆనందమయంగా పయనం సాగించాలని ఆ జంటను వారంతా ఆశీర్వదించారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles