ఖమ్మం అగ్రభాగం

Fri,August 23, 2019 03:37 AM

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లా సత్తాచాటింది. రాష్ట్రంలోనే ఖమ్మం అగ్రభాగంలో నిలిచింది. జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. సభ్యత్వ నమోదులో సంఖ్యా పరంగా పాలేరు నియోజకవర్గంలో 69,175 సభ్యత్వాలను చేర్పించి రాష్ట్రం లో ఆరో స్థానంలో ఉండగా, 67,850 సభ్యత్వాలతో సత్తుపల్లి నియోజకవర్గం ఏడో స్థానంలో నిలిచింది.

(ఖమ్మం, నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో యువనేత కేటీఆర్‌ సభ్యత్వ నమోదు, టీఆర్‌ఎస్‌ కార్యాలయాల నిర్మాణంపై గురువారం రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ కార్యాలయాల ఇన్‌చార్జులత్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసిన పది నియోజకవర్గాలను కేటీఆర్‌ వెల్లడించారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు ఆరు, ఏడు స్థానాలలో ఉండగా గజ్వేల్‌, మేడ్చల్‌, పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్‌ నియోజకవర్గాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, యువనేత కేటీఆర్‌ జిల్లాకు చెందిన శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, శాసనమండలి సభ్యులను, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జులను, స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు. రానున్న కాలంలో పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్నీ ఇదే స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

ఐక్యంగా ముందుకు వెళ్లిన నాయకత్వం..
ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఐక్యంగా ముందుకు వెళ్లడంతో సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలిచినట్లయింది. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, నియోజకవర్గాల శాసనసభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, లావుడ్యా రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్యలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మధిర నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ సభ్యత్వ నమోదును బాధ్యతను తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ 50 వేల సభ్యత్వం చేర్పించే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించగా జిల్లా నాయకత్వం ఆ టార్గెట్‌కంటే మించి సభ్యత్వాలను చేర్పించింది.

వచ్చే నెల 10లోగా కమిటీల ఎన్నిక..
వచ్చే నెల 10లోగా అన్ని గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకోవాలని నియోజకవర్గ ఇన్‌చార్జులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వీటితోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుబంధంగా పనిచేసే రైతు, మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కార్మిక, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఎన్నుకోవాల్సి ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరుగబోతున్న గ్రామ కమిటీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు.

నియోజకవర్గ ఇన్‌చార్జులదే బాధ్యత..
పార్టీ గ్రామ కమిటీల ఎన్నికల బాధ్యతను నియోజకవర్గ ఇన్‌చార్జులకు అప్పగించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇకముందు చేపట్టబోతున్న పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్షించారు. పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశమైన కేటీఆర్‌ గ్రామ కమిటీలన్నింటినీ ఏకగ్రీవ పద్ధతుల్లోనే ఎన్నుకోవాలని సూచించారు. ఆ విధంగా వీలుకాని పక్షంలో చేతులెత్తే పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలన్నారు. గ్రామ కమిటీలు పూర్తయిన వెంటనే మండల కమిటీలకు ఎన్నికలు ఉంటాయని, త్వరలోనే అన్ని స్థాయిల కమిటీలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

153
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles