బాలల హక్కుల పరిరక్షణే అందరి బాధ్యత

Fri,August 23, 2019 11:16 PM

-బాలల హక్కులపై
-జాతీయస్థాయిలో ప్రత్యేక బెంచ్‌లు
-చిల్డ్రన్ ఫ్రెండ్లీ నోడల్ జిల్లాగా ఖమ్మం
-జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్

మామిళ్లగూడెం, ఆగస్టు 23 : బాలల హక్కుల పరిరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకుని సమాజంలో పిల్లలపై జరుగుతున్న వేధింపులను నిరోధించాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్ సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటిసారిగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చామని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బాలల హక్కులు, వారి పరిస్థితిపై బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మూడు రోజులు పర్యటించిందన్నారు. రెండు జిల్లాల నుంచి బాధితులు ఫిర్యాదులు చేసుకునేందుకు, వారి సమస్యలను కమిషన్‌కు వివరించేందుకు వీలుగా జిల్లాలో బెంచ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ బెంచ్ జిల్లా సివిల్ కోర్టుస్థాయిలో వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందన్నారు. జిల్లాలో బాలల హక్కుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా పిల్లలు వేధింపులకు గురవుతున్నా లేదా నిరాధరణకు గురవుతున్న వెంటనే జిల్లా బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. బాలల పై జరుగుతున్న అగాయిత్యాలు లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదులు చేసిన వ్యక్తులు లేదా పిల్లల వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫిర్యాదులలో అన్నింటిని పరిశీలించి చర్యలకై జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారులకు అందిస్తామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా లీగల్‌సెల్ ఆథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వినోద్‌కుమార్, సీపీ తఫ్సీర్‌ఇక్బాల్, కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ఖమ్మం జడ్పీ సీఈవో ప్రియాంక ఉన్నారు.

భూగర్భజలాల పెంపు కోసమే జలశక్తి అభియాన్..
ఖమ్మం రూరల్, నమస్తేతెంగాణ : భూగర్భ జలాల పెంపు కోసమే కేంద్రం జలశక్తి అభియాన్ పథకాన్ని తీసుకువచ్చినట్లు బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్ అన్నారు. శుక్రవారం రూరల్ మండలం ఎం.వీపాలెం హైస్కూల్‌లో జలశక్తి అభియాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. బాలల హక్కులపై ప్రధాని మోడీ దృష్టిసారించారన్నారు. బాలల హక్కులను హరిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జలశక్తి అభియాన్‌లో రూరల్ మండలం ముందంజులో ఉందని అభినందించారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. జలశక్తి అభియాన్ కింద జిల్లాలో ఫారంపాండ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. అనంతరం బాలలహక్కులపై వారు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి, సర్పంచ్ మందాటి సంద్యారాణి, డీపీవో హనుమంతుకొడింబా, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ రాంబాబు, కార్యదర్శి నాగరాజు, ఎంపీటీసీ నండ్ర ప్రసాద్ తదితరుల ఉన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles