ఇక బాదుడే

Sun,August 25, 2019 12:31 AM

-కొత్త రవాణా చట్టంలో పలు కీలక మార్పులు
-మైనర్లకు వాహనాలు ఇస్తే రూ.25 వేలు జరిమానా
-లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు
-ఎమర్జెన్సీ వాహనాలకు సైడ్ ఇవ్వకపోతే రూ. 10 వేలు..
-పోలీస్ కమిషనరేట్‌లో 4 ఏండ్లలో 6,154 మంది డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు

ఖమ్మం క్రైం, ఆగస్టు 24: వాహనదారులు తస్మాత్ జాగ్రత్త...! రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమనిబంధనలను ఉల్లంఘిస్తే ఇక మీ జేబులకు చిల్లులు పడటం ఖాయం. కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలతో తయారు చేసిన కొత్త చట్టం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరి మోటర్ వాహన కొత్తచట్టాన్ని పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన విషయం విధితమే. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి బుధవారం రాత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ బిల్లు న్యాయశాఖ నిబంధనలు రూపొందించడం తరువాయి.. న్యాయశాఖ నిబంధనలు అవసరం లేని 63 క్లాజులను వెంటనే సెప్టెంబర్ నుంచి అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం నూతన మోటరు వాహన చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో ఈ మోటరు వాహన చట్టం అమలయితే పూర్తిస్థాయిలో ప్రమాదాలు నివారించవచ్చు అని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. గతంలో ఉన్న మోటరు వాహన చట్టంలో పలు మార్పులు చేసి ప్రమాదరహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ కమిషనరేట్‌లోని ఖమ్మం నగరంలో నాలుగేండ్లలో 6,154 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసులు నమోదు అయ్యాయి. ఈ డ్రంక్ డ్రైవ్ తనిఖీలో యుకవకులే ఎక్కువగా చిక్కుతున్నట్లు పోలీస్ అధికారులు నమోదు చేసిన కేసులను బట్టి తెలుస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టం అమలులోకి వస్తే ఇంకా కేసులు పెరిగి ఫెనాల్టీ రూపంలో పోలీస్‌శాఖ ఖాజానా నిండే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

మైనర్లకు వాహనాలిస్తే..
కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు వాహనాలు తోలాలనే అతృతతో 18 సంవత్సరాలు నిండకుండానే ద్విచక్రవాహనాలివ్వడంతో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలలో వాహనదారుడు చేసిన తప్పుకు ఇతర కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో చిన్న పిల్లలు (మైనర్)లకు వాహనాలతో పట్టుపడితే ఎలాంటి జరిమానాలు లేకుం డా వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటరు వాహన చట్టంతో మైనర్ యువకులు వాహనాలు నడిపి పట్టుపడితే రూ.25 వేలు జరిమానాలు పడనున్నాయి. మైనర్ల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించకపోతే రాబోయే రోజుల్లో జేబులు గుల్ల చేసుకోవాల్సిందే మరి.

ఎమర్జెన్సీ వాహనాలకు
దారి ఇవ్వకపోతే రూ.10 వేలు..
అంబులెన్స్, ఫైర్ ఇంజన్, తదితర ఎమర్జెన్సీ వాహనాలకు వాహనదారుడు దారి ఇవ్వకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిందే. గతంలో ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే ఎలాంటి జరిమానాలు ఉండేవికావు. ప్రస్తుతం నూతన చట్టంతో ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానాలను విధించనున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో
పట్టుబడేవారిలో యువకులే అధికం..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా యువకులే చిక్కుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. యువకుల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో, వారి పరివర్తనలో మార్పులు తల్లిదండ్రులు దృష్టిసారించకపోవడంతో నేటి యువత మద్యానికి అలవాటు పడుతున్నారని పోలీసులు చెపుతున్నారు. అప్పుడప్పుడు పట్టుబడ్డవారికి పోలీస్‌శాఖ చాలనాలు కట్టించినా, కౌన్సెలింగ్ చేస్తున్నా మార్పు రాకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ పార్టీలు, బర్త్‌డే పార్టీలు, మ్యారేజ్ పార్టీలంటూ యువత మద్యం మత్తులో తూలుతున్నారు. దాంతో పాటు బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడుతున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు మరింత కఠినం కాబోతున్నాయని తల్లిదండ్రులు గ్రహించకపోతే యువతకు గడ్డుకాలమే.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles