మహిళలను ప్రోత్సహించేందుకే వీ హబ్..!

Fri,September 6, 2019 12:57 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ :మహిళా చైతన్యం కల్గిన ఖమ్మం జిల్లాలోని మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీ హబ్ ద్వారా అందిస్తున్న సహకారాన్ని మహిళా పారిశ్రామిక వేత్తలందరూ సద్వినియోగం చేసుకో వాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (ఐటీఈ అండ్ సీ)శాఖ మహిళా పారిశ్రామికవేత్తల కొరకు ప్రారంభించిన వీ హబ్ అవగాహన సదస్సును గురువారం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్ సదస్సుకు హాజరైన మహిళలనుద్దేశించి మాట్లాడారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ప్రత్యేక చొరవతో మన జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.

దీనిలో భాగంగా హైద్రాబాద్ కేంద్రంగా నిర్వహించబడుతున్న వీ హబ్‌ను కూడా జిల్లాలకు విస్తరింపజే యాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎంపిక చేయడం జరిగిందని, మహిళా స్వయంశక్తిని గుర్తించి వారికి ఆసక్తి గల వ్యాపార, పరిశ్రమ రంగాలను ప్రోత్సహించేందుకు 8 నెలల పాటు ఇచ్చె ప్రత్యేక శిక్షణ కొరకు ప్రభుత్వం సుమారు 90 లక్షలు ఖర్చు చేస్తుందని పువ్వాడ తెలిపారు. నూతనంగా వ్యాపారం, పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహికులైన మహిళాలకు, అదేవిధంగా ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిశ్రమలను విస్తరింపజేసేందుకుగాను అవసరమైన విజ్ఞానాన్ని, శక్తిని అందించేందుకు వీ హబ్ ద్వారా తర్పీదు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

జిల్లాలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు వీ హబ్‌ను సద్వినియోగం చేసుకొని వారి వారి రంగాలలో మరింత ఆర్థికాభివృద్ది సాధించాలని ఆయన అన్నారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, ప్రోత్స హించేందుకు కేవలం హైద్రాబాద్‌కు మాత్రమే పరిమితమైన వీ హబ్ మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎంపిక చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఔత్సాహికులైన మహిళా పారిశ్రామికవేత్తలతోపాటు నూతనంగా వ్యాపార, పరిశ్రమలు స్థాపించే వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం జర్మన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీతో కలిసి చేపట్టిన వీ హబ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుందని, ఆసక్తి గల మహిళా పారిశ్రామికవేత్తలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. వీ హబ్ సీఈవో దీప్తీ రావుల మాట్లాడుతూ.. జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు హైద్రాబాద్ తరువాత మొట్టమొదటి సారిగా ఖమ్మం జిల్లాలో వీ హబ్ ద్వారా హర్‌అండ్ నవ్ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.

వ్యాపారం, పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి కలిగిన మహిళలకు అవసరమైన రుణ, మిషనరీ ఇతర సమాచారం అందించడంతో పాటు సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని దీనికిగాను ఆసక్తి కలిగిన మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, జడ్పీ సీఈవో ప్రియాంక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, నగర పాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఇందుమతి, జిల్లా పరిశ్రమ అధికారి కృష్ణారావు, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, నీరజ, దోరేపల్లి శ్వేత, లక్ష్మీ సుజాత, ప్రశాంతలక్ష్మీ, తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

185
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles