మున్సిపోల్స్ మరింత కఠినతరం

Sat,September 7, 2019 12:01 AM

-మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే దరావత్తు ఖరారు
-ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే జైలు.. అనర్హత వేటు

ఖమ్మం, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు సభ్యుల ఎన్నికల వ్యయాన్ని ఇప్పటికే ప్రకటించిన ఎస్‌ఈసీ వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ధరావత్తును ఖరారు చేసింది. ఒకే అభ్యర్థి రెండు, మూడు వార్డులకు నామినేషన్ వేసినా.. ఒకే డిపాజిట్‌ను స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే ఏడాది జైలు శిక్ష, జరిమానాతో పాటు అనర్హత వేటు వేయనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. మున్సిపాలిటీల వార్డుల బరిలో పోటీచేసే అభ్యర్థుల అర్హతలను స్పష్టంగా వివరించింది. వార్డు సభ్యుల ఎన్నికల వ్యయాన్ని ఇప్పటికే ప్రకటించిన ఎస్‌ఈసీ వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ధరావత్తును ఖరారు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికితే ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించనుంది. అంతేకాకుండా అనర్హత వేటు వేయనున్నట్లు హెచ్చరించింది. ఈ నూతన మార్గదర్శకాలను ఎస్‌ఈసీ మున్సిపాలిటీలకు జారీ చేసింది.

నిబంధనలివీ...
జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి రెండు, మూడు వార్డులకు నామినేషన్ వేసినా... ఒకే డిపాజిట్‌ను స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. వార్డుల్లో పోటీ చేసే స్వతంత్య్ర అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా అనర్హత వేటు వేయనున్నట్లు హెచ్చరించింది. పోలింగ్ జరిగే సమయానికి 44 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఎన్నిక ప్రచారం కోసం వినియోగించరాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమాన విధించనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్థనా స్థలాలను చర్చా వేదికగా వాడుకోవడం, ప్రేరేపించేలా ప్రసంగించడం చేస్తే అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles