విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులది నిస్వార్థ సేవ

Mon,September 9, 2019 12:31 AM

ఖమ్మం ఎడ్యుకేషన్‌, సెప్టెంబర్‌ 8: స్వార్థం లేకుండా సేవ చేసేది ఉపాధ్యాయులు మాత్రమేనని, మారుమూల ప్రాంతాలలోని విద్యార్థులనూ తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవడం అద్భుతమని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ పేర్కొన్నారు. నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్‌రాజ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతదూరం ప్రయాణించైనా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జీవితాన్ని అంకితం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. హారితహరం వంటి వాటిలో జిల్లా ముందుందని, విద్యాశాఖలో కూడా జిల్లాను ముందుంచాల్సిన బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు.

టీచర్‌ వృత్తి అత్యున్నతమైనది: కందాల
ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒత్తిడి లేకపోవడంతో విద్యార్థులు అనుకున్నది సాధిస్తూ జీవితాన్ని అర్థవంతంగా తయారు చేసుకుంటారని అన్నారు. ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉండాలని, పలు సూచనలు ఇస్తూ వారితో మమేకం కావాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఎవ్వరినైనా మర్చిపోవచ్చు గానీ ప్రాథమిక స్థాయిలో విద్యను అందించిన గురువులను మాత్రం మరువకూడదని అన్నారు. డాక్టర్స్‌ను, ఇంజనీర్స్‌ను తయారుచేసే ఉపాధ్యాయులది పవిత్రమైన వృత్తి అని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. మేయర్‌ పాపాలాల్‌, డీఈఓ మదన్‌మోహన్‌ మాట్లాడుతూ నిర్మాణాత్మాక వ్యవస్థను తయారుచేస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులని అన్నారు. అనంతరం జిల్లా స్థాయిలోని 24 మంది ఉత్తమ ఉపాధ్యాయలను సన్మానించారు. కార్పొరేటర్‌ శైలజ, ఏడీ గుణశీల, డీసీఈబీ సెకట్రీ కనపర్తి వెంకటేశ్వర్లు, ఏఎంఓ పాషా, మూర్తి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles