నకిలీ వరి విత్తనాలతో మోసపోయిన రైతన్న

Thu,September 19, 2019 12:54 AM

రఘునాథపాలెం : నకిలీ వరి విత్తనాలను కొనుగోలు చేసి ఓ అన్నదాత మోసపోయాడు. నకిలీ విత్తనాలను అంటకట్టిన విత్తన వ్యాపారి రైతన్నను నిండా ముంచాడు. పంట వేసిన 20రోజులకే పరిపక్వ దశకు చేరుకొని పనికి రాకుండా పోయింది. దెబ్బతిన్న వరి పంటను బుధవారం ఆత్మచైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, మండల వ్యవసాయాధికారులు పరిశీలించి రైతును పరామర్శించారు. బాదిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాపటపల్లి గ్రామానికి చెందిన రైతులు ఏలేటి కృష్ణారెడ్డి, కొణకంచి రమేశ్‌లు ఖమ్మం నగరం గాంధీచౌక్‌కు చెందిన ఓ విత్తన దుకాణంలో 1010 రకం విత్తనాలు కొనుగోలు చేసి నారును పోశారు. 20 రోజుల క్రితం నాటు వేశారు. కాగా నాటేసిన 20 రోజుల్లోనే పంట పరిపక్వ దశకు చేరుకొని తాలు కంకులు వేయడం ప్రారంభించాయి. పంట పరిస్థితిని గమనించిన రైతులు నకిలీ విత్తనంగా గుర్తించి నివ్వెరపోయారు. వెంటనే విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బుధవారం అధికారులు గ్రామానికి చేరుకుని ఆత్మచైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, ఏవో ఇంటూరి భాస్కర్ పంటను పరిశీలించారు. నకిలీ విత్తనం వల్లనే పంట ఇరవై రోజుల్లోనే ఈనుడు దశకు వచ్చిందని గుర్తించారు. 10 ఎకరాల్లో సాగు చేసి నష్టపోయిన రైతు కృష్ణారెడ్డికి ఆత్మ కమిటీ ద్వారా రూ.5వేలు ఆర్థిక సహాయం చేశారు. నకిలీ విత్తనం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏవో తెలిపారు. పంటను పరిశీలించిన వారిలో గ్రామ సర్పంచ్ వుయ్యూరు వెంకటనారాయణ, మాజీ ఎంపీటీసీ భద్రయ్య, ఏఈవో శివ తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles