విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా టీఎస్ జెన్కో

Fri,September 20, 2019 11:27 PM

-ఓవరాల్‌గా 80 శాతం పీఎల్‌ఎఫ్
-24గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా
-మార్చి నాటికి బీటీపీఎస్‌లో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
-టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడి

పాల్వంచ, సెప్టెంబర్ 20: విద్యుత్ ఉత్పత్తిలో టీఎస్ జెన్కో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశలు, 7వ దశ కర్మాగారాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న కర్మాగారాల్లో దేశం మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్‌గా 80శాతం పీఎల్‌ఎఫ్ సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సీఎం కేసీఆర్ సహకారంతో అందిస్తున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ బ్యాక్ డౌన్ పరిస్థితి ఉన్నదన్నారు. మణుగూరులోని బీటీపీఎస్ మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతున్నదని, రాబోయే మార్చి నాటికి మిగిలిన మూడు యూనిట్లలలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంజనీర్లు, కార్మికులు అందరి కృషితో అత్యదిక పీఎల్‌ఎఫ్ సాధించడం పట్ల అయన అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారాన్ని సందర్శించిన సీఎండీ..
కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారాన్ని సీఎండీ సందర్శించారు. టర్బయిన్, జనరేటర్, యూసీబీలలో ఆయన పర్యటించారు. ఆయా విభాగాల పని తీరును సమీక్షించారు. యూసీబీలో యూనిట్లను పరిశీలించారు. ఆయా యూనిట్లలలో ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఈలను ఆయన ఆదేశించారు.

ఇంజినీర్లు, కార్మికులకు మెమెంటోల అందజేత..
సూపర్‌క్రిటికల్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కేటీపీఎస్ ఏడోదశ 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని బీహెచ్‌ఈఎల్ సహాకారంతో అనుకున్న సమయానికంటే మందుగానే కేవలం 48 నెలల్లోనే పూర్తి చేసుకున్నందుకు గాను జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు 300 మంది ఇంజనీర్లు, కార్మికులు, సీఈలు, అందరికీ కూడా మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీని సీఈలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జెన్కో డైరెక్టర్లు సచ్చితానందం, లక్ష్మయ్య, అజయ్, వెంకటరాజం, సీఈలు సమ్మయ్య, ఆనందం, బిచ్చెన్న, విద్యుత్ సౌదా ఎస్‌ఈ హనుమాన్ పాల్గొన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles