చేపల చెరువులో మునిగి కాపలాదారుడు మృతి

Mon,September 23, 2019 07:28 AM

ములకలపల్లి: చేపల చెరువులో మునిగి కాపలాదారుడు మృతి చెందిన సంఘటన మండలపరిధిలోని పూసుగూడెం పంచాయతీలో ఆదివారం వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పూసుగూడెం పంచాయతీ, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సడియం గంగరాజు(54) రోజువారీకూలి. ఇటీవల ఓ వ్యక్తి పూసుగూడెంలోని తెల్లవాగు చెరువులో చేపలు పెంపకం చేపట్టగా, ఆ చేపల చెరువుకు గంగరాజు కాపలాదారుడిగా పనికి కుదిరాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి చేపల చెరువుకు కాపలాకు వెళ్లిన గంగరాజు ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు.

దొంగలు చేపల వేట కోసం చెరువులో వలవేసి ఉండవచ్చునని, ఆ వలను తీసేందుకు చెరువులోకి దిగిన గంగరాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, కూతురు విజయ ఉన్నారు. ఇదిలాఉంటే గంగరాజు మృతికి చేపలచెరువు యాజమాని బాధ్యత వహించి పరిహారం చెల్లించాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పూసుగూడెం వద్ద ప్రధాన రహదారిపై ఉంచి ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించేందుకు సదరు చేపల చెరువు యాజమాని అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు. మృతుడి కూతురు విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles