18 ఏళ్లు నిండిన మహిళలకు చీరలు

Mon,September 23, 2019 07:29 AM

-ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం
-4.74 లక్షల చీరల పంపిణీకి సిద్ధం
-గ్రామాలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ
-తహసీల్దార్ల నేతృత్వంలో బృందాల ఏర్పాటు

ఖమ్మం నమస్తేతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతకమ్మ బహుమతి అందివ్వనుంది... సద్దులబతుకమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర సారేను అందించనున్నారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతూ వారి పండుగలను పురస్కరించుకుని నిధులు విడుదల చేసి శభాష్ అనిపించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లాలోని 669 రేషన్ దుకాణాల ద్వారా సుమారు 4 లక్షల 74 వేల 116 మందికి మహిళలకు చేనేత చీరలను అందించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. రేషన్ కార్డులో వివరాల ఆధారంగా 18 ఏళ్లు నిండిన మహిళల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితాను ఆయా మండల కేంద్రాలకు పంపించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ మండలంలో పనిచేసే వివిధ శాఖల అధికారుల సమన్వయంతో బృందాలను నిర్ణయించారు. ఆ గ్రామంలో ప్రజలందరికి అనుకూలంగా ఉన్న ఉమ్మడి స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చీరల పంపిణీ చేస్తారు. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ జరిగేలా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకుని బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే జిల్లాకు అవసరమైన చీరలు జిల్లా కేంద్రానికి చేరడంతో వాటిని ప్రత్యేక గోడౌన్‌లలో భద్రపరిచారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రధానమైంది. సంప్రదాయాలు ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలు, పిల్లలు సంబురంగా జరుపుకుంటారు. పూలను పూజించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటేనే మహిళల పండుగ. పూల పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ చీరెలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రంజాన్ పండుగకు ముస్లింలకు, క్రిస్మస్ రోజున క్రైస్తవులకు బట్టలను కానుకగా అం దించింది. మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగ రోజు ఏ నిరుపేద మహిళలు ఆర్థికంగా ఇబ్బందులతో పండుగకు దూరంగా ఉండరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి నిరుపేద మహిళలు, అమ్మాయిలకు చీరెలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది.

రేషన్‌కార్డులోని వివరాల ఆధారంగా ప్రత్యేక జాబితా...
తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా చీరెలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో నూతనంగా మహిళల పేరు మీద ఆహార భద్రత కా ర్డులను తీసుకవచ్చింది. జిల్లాలకు విభజనకు ముందే ఆహార భద్రత కార్డులను గులాబీ రంగులో ముద్రించి పంపిణీకి రంగం సిద్ధమైనప్పటికీ నూతన జిల్లాలు ఏర్పడటంతో ఆప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో 669 రేషన్‌షాపులుండగా వాటిలో 4,06.930 ఆహార భద్రత కార్డులున్నాయి. అన్ని గ్రామాల్లో ఆహార భద్రత కార్డుల్లో పేరు ఉన్న 18ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేషన్ కార్డుల్లోని వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో 4,74,116 మందికి చీరలను అందించనున్నారు

కుటుంబంలో ఎవరైనా చీర తీసుకొవచ్చు...
రేషన్‌కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరను అందించనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసే కౌంటర్ వద్దకు వచ్చి రేషన్ కార్డులో పేరు చూపించి చీరను తీసుకెళ్లే విధంగా అధికా రులు ఆదేశాలు జారీ చేయనున్నారు. చీరల పంపిణీ సందర్భంలో మహిళలు అందుబాటులో లేకున్నప్పటికీ ఆకుటుంబంలో ఎవరైనా వచ్చి సంబంధిత మహిళ చీరను తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే చీరలు జిల్లాకు చేరడంతో వాటిని ఖమ్మం, నేలకొండపల్లిలోని గౌడాన్‌లలో భద్రపర్చారు.ఖమ్మంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన రెండు పెద్ద గోడౌన్‌లలో చీరలను నిల్వ ఉంచి అక్కడి నుంచి మండల కేంద్రాలకు తరలించనున్నారు. మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చీరలను తీసుకెళ్లి మహిళలకు అందిస్తారు. చీరల పంపిణీ కార్య క్రమాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షించనున్నారు.

మండలాల వారీగా....
బోనకల్ -15,448, చింతకాని-18,376, ఏన్కూర్-12,088, కల్లూరు-23,536, కామేపల్లి - 15,697, ఖమ్మం అర్బన్-77,042, ఖమ్మం రూరల్-27,617, కొణిజర్ల - 21,743, కూసుమంచి - 21,763, మధిర- 23,016, ముదిగొండ - 21,344, నేలకొండపల్లి - 21,005, పెనుబల్లి - 18,660, రఘునాథపాలెం - 18,170, సత్తుపల్లి-24,505, సింగరేణి - 19,208 , తల్లాడ - 19,390, తిరుమలాయపాలెం - 23,405, వేంసూరు - 16,317, వైరా - 18,149, ఎర్రుపాలెం - 17,637.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles