ప్రగతి పరిశీలనకు ముగ్గురు నేతలు..

Wed,October 2, 2019 02:37 AM

-నేడు ఉమ్మడి జిల్లాకు మంత్రులు, ఎంపీ రాక
-పల్లె ప్రగతిని సమీక్షించనున్న అమాత్యులు ఎర్రబెల్లి, అజయ్, ఎంపీ నామా
-ఏన్కూరు మండలం బీఎన్ తండాలో గ్రామసభ, పనుల పర్యవేక్షణ
-దసరా నాటికి పూర్తిస్థాయిలో మారనున్న పల్లెలు
పనులను పురమాయించి వదిలేయకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కంకణం కట్టుకున్నారు.. ప్రగతి పురోగతికి ఆదేశాలు జారీ చేసి ఊరుకోకుండా ఆచరణలో భాగస్వాములు అవుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పనుల వివరాలు, ఫలితాల తీరుతెన్నులు తెలుసుకునేందుకు పల్లెబాట పట్టారు.. ఈ క్రమంలోనే మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10-15గంటలకు ఖమ్మం చేరుకొని నగరంలో పలుచోట్ల గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ఏన్కూరు మండలం బీఎన్ తండాలో జరిగే గ్రామసభకు హాజరవుతారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

-ఖమ్మం, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ నేడు జిల్లాకు రానున్నారు. గత నెల 6న ప్రారంభమైన పల్లె ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక నేటితో 27వ రోజుకు చేరింది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది... అటువంటి కలలుకన్న బాపూజీ జయంతి రోజున నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిసారిగా ముగ్గురు మంత్రులు పర్యటించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న పల్లెకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పరిశీలించి జిల్లాలో ప్రగతిని పర్యవేక్షించనున్నారు.

పల్లె ప్రత్యేక ప్రణాళిక పనులు పరుగులు పెట్టించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతీ రోజు ఏదోఒక జిల్లాలో పర్యటిస్తూ గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పల్లె ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా కొనసాగుతుంది. ఎంత మేరకు పనులు జరిగాయి.. ఇంకా చేయాల్సిన ప్రధానమైన పనులను అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండా పంచాయతీలో పర్యటించి ప్రణాళిక పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారు. గ్రామసభ ముగిసిన అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ పనులపై సమీక్షించనున్నారు.

సమెక్యపాలకుల పాలనలో అభివృద్ధికి నొచుకొని పల్లెలు నేడు స్వరాష్ట్రపాలన కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ల కింద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్ధకు చేరుకుని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. అనేక గ్రామాల్లో శిథిల భవనాలు, పడావుబడ్డ బావులు, అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటికాల్వలు, ఎక్కడ చూసినా చెత్తచెదారంతో నిండిపోయిన గ్రామ ప్రధాన కూడళ్లు, బురదమయంగా మారిన అంతర్గత రహదారులు, చివరికి మనిషి చనిపోయిన అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా సరిగా లేని శ్మశాన వాటికలు ఇది కొన్ని రోజులక్రితం వరకు ఉన్న పల్లెల ముఖచిత్రం నేడు సీఎం కేసీఆర్ స్వయంగా రూపొందించి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నేతృత్వంలోగ్రామ, మండలాల ప్రత్యేకాధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రజలు ప్రతి పనిలో భాగస్వామ్యులై తమ పల్లెలను ప్రగతిపథంలో ముందుతీసుకెళ్తున్నారు. పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే 26 రోజులు పూర్తయి మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పల్లెల్లో ప్రణాళిక పనులు 80 శాతం జరిగాయి. దీంతో పల్లెలన్నీ కొత్తగా కొంగొత్తగా దర్శనమిస్తున్నాయి. గత నెల 6వ తేదీన జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు నేడు జిల్లాకు ముగ్గురు మంత్రులు రానున్నారు.

శరవేగంగా పల్లె ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో శరవేగంగా కొనసాగుతుంది. నేటితో ఈ ప్రణాళిక కార్యక్రమం 27వ రోజుకు చేరుకుంది. బుధవారం 27వ రోజు గాంధీ జయంతి కావడం, జిల్లాలో కొనసాగుతున్న పల్లె ప్రగతిని పర్యవేక్షించి పనులను పురోగతిని సమీక్షించనున్నారు. గ్రామసభలు, అవగాహన ర్యాలీలతో ప్రారంభమైన కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యతాంశాలను ప్రణాళికాబద్ధంగా తీసుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కార్యరంగంలోకి దిగి తమ సమస్యను తామే పరిష్కరించుకుంటూ పల్లెలను ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. ఈనెల 8న దసరా పర్వదినం నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం పూర్తయి పల్లెలన్నీ అద్దంలా మెరవనున్నాయి.

మారిన గ్రామాల స్వరూపం
పల్లె ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల స్వరూపం మారిపోయింది. వర్షాకాలం కారణంగా తొలుత పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చిన కలెక్టర్ తొలుత పల్లెల్లో పారిశుధ్యాన్ని గాడిన పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యంపై సమరభేరి మోగించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అనంతరం ప్రాధాన్యతాంశాల వారీగా వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతీ ఇంటికి ఇంకుడుగుంత నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఇంకుడుగుంతల నిర్మాణం కూడా చేపట్టారు. దీంతో రానున్న రోజుల్లో భూగర్భజలాలు ఎండిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. శిథిలభవనాల కూల్చివేత, పడావుపడ్డ బావులు, బోర్ల పూడ్చివేత కార్యక్రమం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణం తదితర ముఖ్యమైన పనులను పూర్తిచేస్తూ వస్తున్నారు. జిల్లాలో పల్లె ప్రణాళిక ప్రాధాన్యతాంశాల వారీగా శరవేగంగా ముందుకు సాగుతుండటంతో గ్రామాల స్వరూపం పూర్తిస్థాయిలో మారిపోయింది. ఈ నెల 8న దసరా పండుగ పర్వదినానికి పల్లె 30 రోజుల ప్రణాళిక పూర్తయి పల్లెలన్నీ ప్రగతి మల్లెలుగా దర్శనమివ్వనున్నాయి.

మంత్రుల పర్యటన ఇలా...
ఖమ్మం జిల్లా ఏన్కూరు బీఎన్‌తండాలో పర్యటన ముగిసిన అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.15 గంటలకు చుంచుపల్లి తండాకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారు. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి రోడ్డు మార్గం ద్వారా చుంచుపల్లి తండాకు చేరుకోనున్నారు. గ్రామ సభ ముగిసిన అనంతరం ముగ్గురు మంత్రులు మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హెలీకాప్టర్‌లో బయల్దేరి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మంత్రుల పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చుంచుపల్లితండాలో జరిగే గ్రామసభకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూర్చునే విధంగా సభావేదికను ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన సభా ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ వనమా రాఘవేందర్‌రావులు పర్యవేక్షిస్తున్నారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరగనున్న సమీక్షా సమావేశంలో జిల్లాలో గత 30 రోజులుగా కొనసాగిన పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై పనులను జిల్లా కలెక్టర్‌తో కలిసి సమీక్షించనున్నారు. అనంతరం నేరుగా హెలీకాప్టర్‌లో హైద్రాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.

మంత్రుల పర్యటనకు చుంచుపల్లిలో భారీ ఏర్పాట్లు
చుంచుపల్లి: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల పల్లె ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు నేడు రానున్నారు. చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని పనులను పర్యవేక్షించనున్నారు. తొలిసారిగా జిల్లా పర్యటనలోభాగంగా గ్రామసభకు వస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌లకు స్వాగతం పలికేందుకు కొత్తగూడెం టీఆర్‌ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. చుంచుపల్లి తండాలో ఏర్పాటు చేసిన గ్రామసభ వేదికను పరిశీలించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు సభాస్థలి ఏర్పాట్ల పరిశీలన చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుజాతనగర్ చేరుకొని మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. సుజాతనగర్ చేరుకున్న మంత్రులను ర్యాలీ ద్వారా సభా ప్రాంగణానికి తీసుకురానున్నారు. చుంచుపల్లి తండాలో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ప్రచార బోర్డులను, ప్రభుత్వ పథకాలను తెలిపే బ్యానర్లను ఏర్పాటు చేశారు. తండా అంతా పచ్చనిపల్లెగా మారిపోయింది. రహదారికి ఇరువైపులా మొక్కలునాటి పల్లె ప్రగతి ప్రణాళికతో కొత్తరూపును తీసుకొచ్చారు.

మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి
మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు అన్నారు. మంగళవారం మండలంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీజయంతి, 30 రోజుల ప్రణాళిక ప్రగతి పనుల్లో భాగంగా చుంచుపల్లి తండా పంచాయతీలో గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు సత్యవతిరాథోర్, అజయ్‌కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు , ఎంపీ నామాకు రానున్నారన్నారు. ముందుగా మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ క్యాంపుకార్యాలయంలో గాంధీజయంతి వేడుకల్లో పాల్గొంటారని, ఆ తరువాత 200మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ద్విచక్రవాహనాలతో బైకు ర్యాలీగా పోస్టాఫీస్ మీదుగా సుజాతగర్ వద్ద మంత్రులు అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ నామాకు స్వాగతం పలుకనున్నామన్నారు. మంత్రుల పర్యటనను అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్యాసోన, విజయలక్ష్మీ, చుంచుపల్లి సర్పంచ్ మాలోత్ ధనలక్ష్మీ, కో-ఆప్షన్ సభ్యులు ఆరీఫ్ ఖాన్, ఉపసర్పంచ్ శ్రీహరి, జిల్లా టీఆర్‌ఎస్ మండల ప్రసిడెంట్ బాగం ఉమమహేశ్వరరావు, నాయకులు ఎం.ఎ.రజాక్, కాసుల వెంకట్, అన్వర్‌పాషా, గిడ్ల పరంజ్యోతి, లావుడ్యా సత్యనారాయణ, తొగరు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఎస్‌కె.నన్నె, లక్ష్మీణరావు తదితరులు పాల్గొన్నారు.

235
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles