పూల పండుగ

Mon,October 7, 2019 01:06 AM

-నేత్ర పర్వంగా సద్దుల బతుకమ్మ..
-జిల్లా వ్యాప్తంగా సంబురంగా పూల పండుగ
-సర్దార్ పటేల్ స్టేడియంలో వైభవంగా మహాబతుకమ్మ వేడుకలు
-కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ మున్నేరులలో బతుకమ్మల నిమజ్జనం..

ఖమ్మం మయూరిసెంటర్, అక్టోబర్ 6 : తంగేడు చీరకట్టి, చెక్కిళ్లలో చామంతులు దిద్ది, సిగలోన మల్లెలు తురిమి, పూబంతిలా, మాతల్లిగా మురిసిపోయింది బతుకమ్మ.. తంగేడు తళతళలు, గునుగుల గుభాళింపులు, చామంతుల ఛరిష్మాలు.. మందారాల మురిపాలు, సీతజడల సిగ్గులు వెరసి జిల్లా పూదోటగా విరబూసింది.. వేనవేల పూలు గుభాళించాయి... పూల హరివిల్లులు నేలకు దిగాయి.. పుడమి తల్లిపై రంగురంగుల పూలు పచ్చబొట్లయి మొలిచాయి.. తీరొక్కపూలు బతుకమ్మలో పొందికగా ఒదిగి ఎదిగాయి.. అనేక వరుసల్లో పేర్చిన సప్తవర్ణ శోభితమైన పూలు గుఛ్చాలై, పూల శిఖరాలై, పూల ఏరులు ప్రవహించాయి.. దీంతో జిల్లా అంతటా పూల జ(వ)నం కనువిందు చేసింది.. తీరొక్కపూల కలబోతతో గుడి గోపురాలయ్యాయి.. తొమ్మిది రోజులపాటు బతుకమ్మలోమురిసి, మెరిసి, ఒదిగిన తీరొక్క పూలు పరవశించి, ఆధ్యాత్మిక, ఆనంద పరిమళాలు వెదజల్లాయి..

ఆదివారం జిల్లా అంతటా వెంపలి కొమ్మల పవిత్రతతో, పలు రకాల సద్దుల నైవేథ్యంతో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పెరుగన్నం, సజ్జముద్దలు, ఎండు కొబ్బరి అన్నం, పులిహోర, చపాతి ముద్దలు.. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నల పొడుల సద్దుల సందడితో బతుకమ్మ వైభవం ఆనందోత్సాహాలను నింపింది. రంగురంగుల పుష్పాలతో రహదారులన్నీ సప్తవర్ణాలను సంతరించుకున్నాయి. ఆడపడుచుల తొమ్మిది రోజుల బతుకమ్మ ఆటపాటల పరిమళాల అనుబంధాలను ముడివేశాయి.. జిల్లా వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం, సత్తుపల్లి,వైరా, పాలేరు, మధిర నగరాలతో పాటు వాడవాడలా సద్దుల బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీంతో ఖమ్మం నగరం పూలజాతరైంది.. సప్తవర్ణాల హరివిల్లుల చీర కట్టినట్లుగా ప్రకృతి రమణీయ కాంతితో మెరిసింది.. సంప్రదాయ వస్త్రధారణలతో మహిళలు, యువతులు, చిన్నా పెద్దా అందరూ బతుకమ్మ దండుగా కదిలివచ్చారు.. వందలాది మంది మహిళలు వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ ఆటపాటలాడారు. ఉయ్యాల, కోల్, గౌరమ్మ, చందమామల రాగయుక్తమైన బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలతో ఆధ్యాత్మిక, ఆనంద పరవశమైంది.

సర్ధార్ పటేల్ స్టేడియంలో మహా బతుకమ్మ...
జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది మహా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. 20 అడుగుల భారీ బతుకమ్మను పేర్చి పది వలయాల్లో వందలాది మహిళలు బతుకమ్మ ఆటపాటల్లో మునిగితేలారు. ఈ బతుకమ్మల కార్యక్రమాన్ని నగర మేయర్ గుగులోత్ పాపాలాల్ ప్రారంభించి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ ఆవిర్భావం అనంతరం బతుకమ్మకు ప్రాధాన్యతను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందింపచేసి సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీఠ వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ జే శ్రీనివాసరావు, డీఆర్‌డీఏపీడీ ఇందుమతి, జిల్లా సంక్షేమాధికారి సబిత, డీవైఎస్‌వో ఎం పరంథామరెడ్డి, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కొత్తపల్లి నీరజ, నగరపాలక సంస్థ డీఈ రంగారావు, మెప్మా సిబ్బంది, నగర పాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి కాల్వొడ్డు వందలాది మహిళలు బతుకమ్మలతో నగరంలో భారీ ప్రదర్శన చేశారు. ఈప్రదర్శన వైరారోడ్, జడ్పీ సెంటర్, బస్టాండ్, మయూరిసెంటర్ మీదుగా కాల్వొడ్డు వద్దకు చేరుకుంది. కాల్వొడ్లులోని మున్నేరులో బతుకమ్మలను ఒక్కొక్కటిగా ఘనంగా నిమజ్జనం చేశారు.

టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో..
టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, కార్పొరేటర్ పగడాల నాగరాజులు మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలతో 9 రోజుల పాటు నిర్వహించిన సంబురాలు, వేడుకలలో భాగంగా తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, తన్నీరు శోభారాణి, కందగట్ల రాజేందర్, గొట్టెముక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐఎంఏ హాల్లో ఐఎంఏ సభ్యులు, వైద్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైద్యురాళ్లు పెరుమాళ్ల శ్రీలత, శోభాదేవి, పద్మావతి, సంధ్య, బొల్లికొండ శ్రీదేవి, లక్ష్మీరాజేశ్వరి, జ్వలిత, ఉషారాణీ, ఉమాపాలేటి, సురేఖ, మంజుల తదితరులు పాల్గొన్నారు. 24వ డివిజన్ కృషి భవన్ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వారాకా నగర్‌లో శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ నేతృత్వంలో బోడేపూడి శోభన్ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో దుంపల రవికుమార్, బ్రహ్మాచారి, బ్రహ్మం, నరేంద్ర, నర్సింహరావు తదితరులున్నారు.

ఘనంగా బతుకమ్మల నిమజ్జనం..
బతుకమ్మల ఆటపాటల అనంతరం, జిల్లాలోని ఆయా ప్రాంతాలలోని సమీప జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఆకేరు, మున్నేరు, గోదావరి, పాలేరు జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తూ.. వెల్లిరా బతుకమ్మ.. మల్లిరావమ్మ బతుకమ్మ అంటూ బతకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. మహిళలంతా తాము తెచ్చుకున్న సద్దులతో పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు.. జిల్లా కేంద్రంలో కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ మున్నేరులో బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు.

ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని చింతలపాటి వారి వీధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఘనంగా బతుకమ్మలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహించారు. చింతలపాటి వీధిలో 23 అడుగులు, 21 అడుగుల బతుకమ్మలను ట్రాక్టర్‌పై ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ముందుగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా రెండు ట్రాక్టర్లపై భారీ బతుకమ్మలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని కోలాట నృత్యాలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కొత్తూరు ప్రభాకరరావు, చల్లగుళ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, కూసంపూడి మహేష్, వీరపనేని బాబి, వల్లభనేని పవన్, అద్దంకి అనిల్‌లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో ఎంపీ నామా సోదరి
మయూరి సెంటర్ : సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆదివారం రాత్రి టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు సోదరి మల్లెంపాటి తులిశమ్మ, టీఆర్‌ఎస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, తెలంగాణ జాగృతి నాయకురాళ్లు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెంపాటి తులిశమ్మ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం భక్తి శ్రద్దలతో పూజలు చేయడం, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందింప చేసిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణకే తలమానికమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 35వ డివిజన్‌లో ఆ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరి లక్ష్మీసుజాత, ఊటుకూరి రవికాంత్, గోరెంటి వెంకటేశ్వర్లు, గోరెంటి రవి, పొన్నం వెంకటేశ్వర్లు, కిషన్‌రావు, కొప్పెర శ్రీనులు పూజలు నిర్వహించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

298
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles