సమ్మెలో కార్మికులను బలిచేస్తున్న కార్మిక సంఘాలు

Tue,October 8, 2019 12:56 AM

-యూనియన్ల పేర్లు చెప్పుకుంటు పబ్బంగడుపుతున్న వైనం
-డ్యూటీలకు వెళ్లకుండా యాజమాన్యాలపై ఒత్తిడిలు
- అమాయక కార్మికులను ఆసరాగా తీసుకుని డిపోల వద్ద పెత్తనం
- కార్మిక సంఘాల నాయకులతోనే ఆర్టీసీకి నష్టాలు
ఖమ్మం క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన ఆర్టీసీ కార్మికులు సంస్థలో క్రమశిక్షణతో మెలుగుతూ ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందారు. ఆర్టీసీ సంస్థ అంటే కార్మికులపై ప్రతి ఒక్కరికి గౌరవమే....సమాజంలో ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లగా, మెకానిక్‌లుగా పనిచేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ మర్యాదపూర్వకంగా వారిని గౌర వించేవారే...డ్యూటీలకు వెళ్లి ప్రశాంతంగా కుటుంబంతో గడిపే కార్మికులు ప్రస్తుతం సమ్మెతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆర్టీసీ సంస్థలో వామపక్ష పార్టీలకు చెందిన సంఘాలల్లో కొంత మంది కార్మిక సంఘాల నాయకులు కార్మిక ముసుగులో సంస్థపై పెత్తనం చెలాయిస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. డ్రైవర్, కండక్టర్ కష్టపడి విధుల్లోకి వెళ్లి సంస్థ పురోగతికి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే ఓ చిరు ఆశతో కష్టపడుతుంటే కొంత మంది కార్మిక సంఘాల నా యకులు డిపో వద్ద ఉంటూ అరాచకాలు సృష్టిస్తున్నారు. యాజమాన్యం వారి మాటలు వినకపోతే అమాయక కార్మికులను రెచ్చగొట్టి డిపోల ఎదుట నిరసనలు ధర్నాలు చేసేవారు. సంస్థ అభివృద్ధి చెందాలంటే అందరూ కష్టపడి పనిచేస్తే సాధ్యమవుతుందనే ఆలోచన కూడా వారిలో ఉన్నప్పటికీ వారి ఇతర వ్యాపారాలు, వారి లీడర్‌గిరి కోసం అమాయక కార్మికులను బలిచేస్తున్నారు.

ఖమ్మం రీజియన్‌లోని సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, మధిర, ఖమ్మం డిపోలల్లో కొంత మంది లీడర్‌గిరి చేస్తూ వారు అసలు డ్యూటీకే వెళ్లరు. అమాయక కార్మికులకు ఏమైన ఇబ్బందులు వస్తే దానిని ఆసరాగా చేసుకుని వారి ఇతర పనులు కూడా చేయించుకుని తమ సంఘమే చేసిందని గొ ప్పలు చెప్పుకుంటూ చలామణి అవుతున్నారు. సంస్థ ఓ పక్క నష్టాల ఊబిలో కొట్టు మిట్టాడుతుంటే దానిని పరిరక్షణ చేయకుండా ప్రభుత్వంపై, ప్రభుత్వ యంత్రాంగం పై హుకుంలు జారీ చేస్తూ సమ్మెపేరుతో అమాయక కార్మికుల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారు. ఒక బస్సు బయటికి వెళ్లిందంటే దానికి ముఖ్య కారకుడు డ్రైవరే... సంస్థకు ఆర్థిక వనరు కోసం పనిచేసేది కండక్టరే...సంస్థ బస్సులను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ బస్సులను చక్కగా తీర్చిదిద్ది రోడ్లపై పరిగెత్తించేది మెకానిక్‌లే...ఇలాంటి వారు సంస్థ కోసం తమతమ కష్టాన్ని పనంగా పెట్టి పనిచేస్తుంటే చక్కగా ఖద్దర్ చొక్కాలు ధరించుకుని డిపోల ముందు కాలయాపన చేస్తున్న నాయకులు ఎందుకు పనిచేయడం లేదనే ఆలోచన అమాయక కార్మికులకు రాకపోవడంతో కార్మిక సంఘాల నాయకుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఖమ్మంలో 2013 లో ఓ కార్మిక సంఘం భవనమే అమ్ముకున్నారు. కార్మికులు చందాలతో కొన్న భవనమే కొంత మంది కార్మిక నాయకులు వాటిని అమ్ముకుని జల్సాలు చేసుకు న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ సంఘం లోనుంచి కొంత మంది నాయకులు బయటికి వచ్చి వేరే యూనియన్‌లలో చలామణి అవుతున్నారు. ఇలాంటి లీడర్‌గిరి నాయకులు కార్మిక సంఘాల్లో ఉంటే కార్మికులకు ఏం న్యాయం జరుగుతుందో అనే ఆలోచన అమాయక కార్మికుల్లో రాకపోవడం బాధాకరం.

డిపోలల్లో సంఘాల పేర్లు చెప్పుకుంటూ బెదిరింపులు..
ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో ఉన్న కొంత మంది సంఘాల నా యకులు వారి వారి సంఘాల పేర్లు చెప్పుకుంటూ డీఎంలను, ఎంఎఫ్‌లను, డీవీఎంలను బెదిరించుకుంటూ వారి జీవితాలను సాగతీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆర్టీసీలో కార్మికుల కోసం పనిచేసే వామపక్ష పార్టీలకు చెందిన సంఘాలుండేవి. రానురాను అవికాస్త కార్మికులను బలిచేసే సంఘాలుగా మారాయి. ఖమ్మం రీజి యన్‌లో ఏదైన గుర్తింపు సంఘం గెలిచిందంటే ఆ సంఘంలో చేరటానికి ఏ పదవులు ఇస్తారని అడిగి సంఘాలు మారుస్తున్నారు. వారు అడిగినట్లు డిపో అధ్యక్ష పదవులు, డిపో కార్యదర్శి పదవులను పొంది డిపోలల్లో అందరిని మానసికంగా వేధిస్తున్నారు. కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతే మేమున్నామనే భరోసా కూడా ఇచ్చే నాయకుడు ప్రస్తుతం కనబడటం లేదు. వారివారి స్వాలాభాల కోసమే పనిచేస్తున్నారే తప్ప సంస్థ కోసం పని చేద్దామనే ఆలోచన కూడా రావడం లేదు. ఓ పక్క ప్రభుత్వం ఆర్టీసీ నష్టపోతున్న సంస్థకు బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆ నష్టాలకు వడ్డీలు కడుతూ కార్మికులకు జీతాలతో పాటు వారి వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంది. వారికి పండుగల సమయంలో బోనస్‌లు, తదితర అంశాలపై కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అమాయక కార్మికులను రెచ్చగొడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డిపోలల్లో బస్సులకు ఆదాయం సరిగా రావడం లేదని డిపో మేనేజర్లు దృష్టిసారిస్తున్నప్పటికి కొంత మంది కార్మిక సంఘాల నాయకులు వాటిని తప్పుపడుతున్నారు. గేటు మీటింగ్‌లు, మెయింటెనెన్స్ మీటింగ్‌లు లాంటి సమావేశాల్లో ఇతర సమస్యలపై మాట్లాడి సంస్థ అభివృద్ది కోసం ఎలాంటి కృషి చేయాలో కూడా ఆలోచించకుండా వారి వారి పబ్బాలను గడుపుకుంటున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం డిపోలల్లో ఇలాంటి నాయకులు న్నారు. ఖమ్మం డిపోలో కొన్ని సంఘటనల్లో కార్మికులు వారి సమస్యలపై అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కుట్రలతో బలిచేసిన సంఘటనలున్నాయి.

కార్మికుల పక్షానే ప్రభుత్వం...
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన సీఎం కేసీఆర్ ఏనాడు కూడా చెప్పలేదు. కార్మికులకు రావాల్సిన సంక్షేమాల గురించే మాట్లాడారే తప్ప సంస్థను విలీనం చేస్తామనే విషయం ఏ రోజు కూడా వినలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ ఆర్టీసీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేశారని తెలంగాణలో కూడా ఆర్టీసీని విలీనం చేయాలని కొంత మంది కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. ఏ రోజు కూడా కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఇలాంటి డిమాండ్లపై నివేదిక ఇవ్వలేదు.తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగను ఆసరాగా చేసుకుని కొంతమంది లీడర్‌గిరి నాయకులు సమ్మెకు పిలుపునివ్వడంతో అమాయక కార్మి కులతో పాటు ప్రయాఫికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీసభ్య కమిటీకి వారి డిమాండ్స్‌ను చెప్పాల్సి ఉండగా కమిటీ సభ్యులనే బెదిరింపు ధోరణికి దిగారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉంటూ కార్మికుల కోసం అనేక సదుపాయాలను అందించింది. కొంత మంది కార్మిక సంఘాల నాయకుల ముసుగులో అరాచకాలుచేసి నేడు వారు రాష్ట్ర నాయకులుగా చలామణి అవుతూ ప్రభుత్వానికే బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. 2013 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు ఫిట్‌మెంట్ రావాల్సి ఉండేది. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 మే నెలలో ఆర్టీసీ కార్మి కులు సమ్మె నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఇదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు ఇబ్బందులుండదనే ఉద్దేశంతో 44 శాతం ఫిట్‌మెంట్‌నిచ్చారు.

2018 జూన్ నెలలో మళ్లీ ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతిని ప్రకటిచింది. ఒక పక్క సంస్థ రూ. 3500ల కోట్ల నష్టాలలో ఉన్నప్పటికీ అమాయకులైన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 44 శాతం ఫిట్‌మెంట్ ప్రభుత్వంపై రూ. 900ల కోట్ల భారం పడినప్పటికీ కేసీఆర్ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. సంస్థ పురోగతి కోసం ఆర్టీసీలో కొత్తబస్సులను తీసుకొచ్చారు. ఖమ్మం రీజియన్‌లోని ప్రస్తుతం ఉన్న గరుడ, రాజధాని, కొత్త సూపర్ లగ్జరీ బస్సులు అనేకమున్నాయి. ప్రతి సంవత్సరం ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తూ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు.ఖమ్మం రీజియన్‌లో ప్రతి సంవత్సరం ఆరు డిపోలు నష్టాలతోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కార్మికులైన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు పనిచేస్తున్న ఇంకా నష్టాలు ఎందుకు వస్తున్నాయో అమాయక కార్మికులు విశ్లేషించలేకపోతున్నారు.

281
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles