సాఫిగా

Thu,October 10, 2019 12:44 AM

-ఐదో రోజూ కనిపించని సమ్మె ప్రభావం
-అందుబాటులోకి ప్రైవేట్ బస్సులు
-అన్ని రూట్లలోకొనసాగిన రాకపోకలు
-బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ
-సమన్వయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
-ఐదో రోజు గమ్యస్థానాలకు చేరిన ఐదు వేల మంది
-తాత్కాలిక ప్రాతిపదికన 60 మంది కండక్టర్లు, 60 మంది డ్రైవర్ల నియామకం

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె ప్రభావం నామమాత్రమే. ఐదో రోజు బుధవారం జోరుగా ప్రజారవాణా కొనసాగగా.. యాదగిరిగుట్ట, భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, ఆలేరు బస్టాండ్‌ల్లో ప్రయాణికుల సందడి కనిపించింది. యాదగిరిగుట్ట డిపో నుంచి వెళ్లే భువనగిరి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేటతో పాటు అన్ని గ్రామాలకు బస్సులు నడిచాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఈ బస్సులు నడుపుతున్నారు. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో కూడా ప్రయాణికులను తరలించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో బస్టాండ్ ఆవరణలో వాటి సందడి కనిపించింది. అన్ని బస్టాండ్‌లలో ఆయా రూట్లకు వెళ్లే బస్సులను సిద్ధంగా ఉంచారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు ఇప్పటికే కల్పించారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్టాండ్ ఆవరణల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ఘటనలు జరగకుండా చూశారు.

అందుబాటులో ప్రైవేట్ వాహనాలు..
జిల్లాలో 45 ఆర్టీసీ బస్సులు, 15 స్కూల్ బస్సులు, 40 మాక్సీ క్యాబ్‌లు, 45 మోటారు క్యాబ్‌లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు తాత్కాలికంగా 60 డ్రైవర్, 60 కండక్టర్లను తీసుకున్నారు. స్కూల్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు, ఓమ్ని బస్సులకు రవాణాశాఖ వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి పర్మిట్ తీసుకునే అవకాశం కల్పించారు. ఏఎంవీఐ రఘుబాబు, శ్రీకాంత్‌లు తాత్కాలిక డ్రైవర్ల ఎంపిక బాధ్యతలను నిర్వహించారు. మొత్తం 5 వేల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చారు. యాదగిరిగుట్ట డిపో పరిధిలో ఏసీపీ టీ.మనోహన్‌రావు, ఏఆర్ ఏసీపీ కిష్టయ్య, సీఐ నర్సింహారావు, ఆంజనేయులు, ఎస్‌ఐ రమేష్ బందోబస్తు నిర్వహించారు. అద్దె బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు. యథావిథిగా బస్సులు నడిచేలా చూడాలని కోరారు.

ప్రైవేట్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్..
పండుగ తెల్లారి బస్సులను పంపే విషయంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యూటీకి వెళ్తున్న ప్రైవేటు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు జరిపించారు. భువనగిరి ఆర్‌డీవో గార్లపాటి వెంకటేశ్వర్లు, ఏసీపీ టీ. మనోహర్‌రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతీ డ్రైవర్ బస్సును గ్యారేజీ నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఏఎంవీఐ సమక్షంలో నడిపిన మీదటనే డ్యూటీకి అనుమతినిస్తున్నారు. సోమవారం ఉదయం భారీ సంఖ్యలో యువకులు డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసేందుకు డిపో వద్దకు చేరుకోగా అర్హులైన వారిని ఎంపిక చేశారు.

ర్యాలీ నిర్వహించిన కార్మికులు ..
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద మౌనం పాటించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ప్రతిపక్ష నేతలు మద్దతు..
యాదగిరి బస్‌డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించగా సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఏఐటీయూసీ నాయకులు మద్దతు పలికారు. సీపీఎం జిల్లా నాయకురాలు భట్టుపల్లి అనూరాధ, కల్లూరి మల్లేశం, ఏఐటీయూసీ నాయకులు ఇమ్రాన్, బీజేపీ నాయకులు రచ్చ శ్రీనివాస్, బెలిదే అశోక్, కల్లెం శ్రీనివాస్, పెద్ద కందుకూర్ సర్పంచ్ బీ.రాములు సంఘీభావం తెలిపారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles