జిల్లాలో పెరిగిన రాకపోకలు

Sat,October 12, 2019 11:48 PM

ఖమ్మం కమాన్‌బజార్‌, అక్టోబర్‌ 12: జిల్లాలో పండుగకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న ప్రజల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులు బస్సులు నడుపుతున్నారు. శనివారం జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ ఖమ్మం డివిజన్‌ అధికారులు తమ పరిధిలోని వందల సంఖ్యలో బస్సులను పెంచి ప్రయాణికులకు భరోసాను కల్పిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తోంది. ఆర్టీసీ డివిజన్‌ పరిధిలోని సత్తుపల్లి, ఖమ్మం, మధిర డిపోలకు చెందిన అనేక రూట్లల్లో బస్సుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఖమ్మం - హైదరాబాద్‌, ఖమ్మం - రాజమండ్రి, ఖమ్మం - వరంగల్‌ వంటి దూరప్రాంత సర్వీసులతోపాటు జిల్లాలోని ప్రతి గ్రామానికీ సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్టీసీలో సమ్మె లేదు అనే తరహాగా బస్సులను విరివిగా నడిపిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి పల్లె వెలుగు బస్సులను కూడా కేటాయించి గ్రామాలకు పంపిస్తున్నారు. దసరా పండుగ సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వివిధ రూట్లల్లో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్‌ వాహనాల అధిక టిక్కెట్‌ ధరలను కట్టడి చేస్తున్నారు. బస్సుల సంఖ్యను, ప్రయాణికుల ఇబ్బందులను కలెక్టర్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.

జిల్లాలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ సేవల కోసం వినియోగించుకుంటున్నారు. జిల్లాలో రవాణా శాఖ అధికారుల, ఆర్టీసీ అధికారులు బస్సుల పనితీరును శనివారం పరిశీలించారు. వివిధ శాఖల నుంచి ఉద్యోగులు రావడంతో ఆర్టీసీ అధికారులు కొంత ఊరట కలిగింది. ప్రైవేట్‌ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక టిక్కెట్‌ ధరలు వసూలు చేస్తున్నారని అధికారుల దృష్టికి రావడంతో వారు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్‌ వాహనదారులను కట్టడి చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతోపాటు అద్దె బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, మోటార్‌ క్యాబ్‌ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు..
ఆర్టీసీ ఖమ్మం డివిజన్‌ పరిధిలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ ఉంటుండడంతో ఆయా రూట్లల్లో బస్సులను విరివిగా తిప్పుతున్నారు. ప్రతి రోజూ తిరిగే షెడ్యూల్‌ బస్సులు కాకుండా బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ ఉంటే వారు ఏ ఊర్లకు వెళ్లాలో తెలుసుకొని బస్సులను కేటాయిస్తున్నారు. ఖమ్మం డివిజన్‌ పరిధిలోని మొత్తం 365 బస్సులను పూర్తిస్థాయిలో నడిపారు. ఖమ్మం డిపోలో సంస్థ బస్సులు 36, అద్దె బస్సులు 48, మధిర డిపోలో సంస్థ బస్సులు 30, అద్దె బస్సులు 21, సత్తుపల్లిలో సంస్థ బస్సులు 60, అద్దె బస్సులు 30, ప్రైవేట్‌ బస్సులు 60, మ్యాక్సీక్యాబ్‌లు 80 చొప్పున నడిపించారు.

వివిధ రూట్లలో బస్సుల తనిఖీలు..
జిల్లాలోని వివిధ రూట్లలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల నుంచి వారు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆర్టీసీకి కేటాయించిన వివిధ శాఖల ఉద్యోగులు వివిధ రూట్లలో బస్సులను తనిఖీ చేస్తున్నారు. అధిక చార్జీల టికెట్‌ వసూళ్లపై ఆరా తీస్తున్నారు.

అదనంగా ప్రైవేట్‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు..
రవాణా శాఖ అధికారులు అదనంగా ప్రైవేట్‌ బస్సులను, మాక్సీక్యాబ్‌లను ఏర్పాటు చేసి జిల్లాలో నడిపిస్తున్నారు. ఆయా వాహనాలకు పర్మిట్‌లను జారీ చేసి వివిధ రూట్లలో తిప్పుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు కూడా ఆర్టీసీ అధికారులకు సహకరిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆర్టీఓ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంవీఐలను ఆయా డిపోల్లో ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీని ప్రర్యవేక్షిస్తున్నారు.

జిల్లాలో శనివారం తిరిగిన బస్సులు..
ఆర్టీసీ బస్సులు 126
అద్దె బస్సులు 99
ప్రైవేట్‌ బస్సులు 60
మ్యాక్సీ క్యాబ్‌లు 80
మొత్తం 365

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles