వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలి

Tue,October 15, 2019 01:01 AM

ఖమ్మం క్రైం: రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో మద్యం దుకాణాలకు వ్యాపారస్తులు ముందుకు వచ్చేవిధంగా నిబంధనలు మరింత సులభతరం చేసిందని, నూతనంగా వచ్చే వ్యాపారస్తులు మద్యం దుకాణాల టెండర్లకు ముందుకురావాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వీడియోస్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్-1 లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 89 మద్యం దుకాణాలలో 4 ఏజెన్సీ దుకాణాలున్నాయన్నారు. నూతన మద్యం దుకాణాల కోసం ఈ నెల 9 నుంచి 16 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నూతన మద్యం పాలసీ ద్వారా వ్యాపారస్తులకు ఊరట కలిగించేందుకు నిబంధనలు సడలించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో దరఖాస్తులకు అనేక పేజీలు ఉండేవని, ప్రస్తుతం ఒక ఆధార్‌కార్డు, పాన్ కార్డుల జిరాక్స్ పత్రాలను తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో ఎక్సైజ్ శాఖ ఈఎండీ రూ. 5 లక్షలు వసూలు చేసేదని, ప్రస్తుతం అవి తొలగించబడ్డాయన్నారు. గతంలో ఒకొక్క డివిజన్‌లో వైన్‌షాపులుండేవి. దీంతో వ్యాపారస్తులకు వైన్‌షాపులు నిర్వహించుకునేందుకు అధిక అద్దెలుండేవని, ప్రస్తుతం నాలుగు లేదా మూడు డివిజన్లకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వైన్‌షాపును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

గతంలో రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆరు వాయిదాల్లో వ్యాపారస్తులు కట్టడానికి ఇబ్బందులు పడేవారని, దానిని 8వాయిదాల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో బ్యాంక్ గ్యారెంటీని ఏడాది ఎక్సైజ్ ట్యాక్స్‌పై 67శాతం వసూలుచేయడం జరిగిందని, ప్రస్తుతం దానిని 50శాతంకు కుదించడం జరిగిందన్నారు. వైన్‌షాపులు నిర్వహించే వ్యాపారస్తులు పర్మిట్ రూంలను ఏర్పాటు చేయాలంటే రూ. 2లక్షలు కట్టేవారని, ప్రస్తుతం వ్యాపారస్తులకు ఆర్థిక భారం అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. నూతన మద్యం పాలసీ ద్వారా పర్మిట్ రూంలకు ఎక్సైజ్ ట్యాక్స్‌ను తొలగించడం జరిగిందన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వాకిన్ ఏ4 స్టోర్ పొందేందుకు సరళీకృతమైన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఈ వ్యాపార నిర్వహణపై తగిన అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఎక్సైజ్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో టెండర్ ప్రక్రియలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని, ఈ సారి కూడా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని డీసీ తెలిపారు. ఈ నెల 16 వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెల 18 న ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో కలెక్టర్ ఆర్‌వీ కర్ణణ్ ఆధ్వర్యంలో డ్రాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో స్టేషన్-1 సీఐ రాజు తదితరులు పాల్గొన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles