ప్రతీ మున్సిపాలిటీలో..సమగ్ర సిటీ శానిటేషన్ ప్లాన్

Wed,October 16, 2019 01:00 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 15: ప్రతి మున్సిపాలిటీలోనూ సమగ్ర సిటీ పారిశుధ్య ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖల మంత్రి కే.తారకరామారావు.. అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అర్బన్ ప్రాంతాల అభివృద్ధి కోసం అన్ని మున్సిపాలిటీల్లో సమగ్ర సిటీ శానిటేషన్ ప్లాన్‌ను కూడా వారం రోజులలోపు సమర్పించి తదనుగుణంగా పనులు చేపట్టాలని కలెకర్లకు మంత్రి సూచించారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ మొదులుకొని ట్రాన్స్‌ఫార్మేషన్, డంపింగ్ యార్డులకు తరలించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, రవాణాకు అవసరమైన వాహనాలు తదితర అంశాలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా ప్రతి పది వేల జనాభా గల పట్టణాలలో 28 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలని, ఐదువందల కుటుంబాలకు ఒక స్వచ్ఛ ఆటోను, ప్రతి మూడు వందల వ్యాపార సంస్థలకు ఒక మినీ లారీ ఉండే విధంగా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఇంకా ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి కాని మున్సిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్ చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను 90 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. తద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతుందని, సమగ్ర శానిటేషన్ ప్లాన్‌లో రూపొందించిన వాహనాలు, అవసరమైన పారిశుధ్య కార్మికుల ఖర్చులను ఎల్‌ఆర్‌ఎస్, డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి సమకూర్చుకోవచ్చని అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ సిబ్బందితోపాటు మున్సిపాలిటీల పారిశుధ్య కార్మికులందరికీ యూనిఫామ్స్ తప్పనిసరిగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లను, ప్రధానంగా మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మించాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలోనూ నర్సరీని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. తాగునీటి సరఫరాను మరింత మెరుగు పర్చేందుకు నీటి వనరుల అధ్యయనం చేసి సమగ్ర శానిటేషన్ ప్రణాళికలో చేర్చాలని మంత్రి సూచించారు. పట్టణాల్లో, నగరాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించడంతోపాటు పెట్రోల్ బంకులు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో కూడా షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను మార్చి 31 లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన మున్సిపల్ చట్టంపై మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. రెండో విడత మరోమారు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలోనూ కలెక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో వార్షిక నివేదికలు రూపొందించుకొని తదనుగుణంగా నిధుల కేటాయింపు ఆధారంగా పారిశుధ్య పనులకు అవసరమైన వాహనాలను, సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒక నగరపాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించామన్నారు. డీఎంఎఫ్‌టీ నిధులతో మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీలోనూ సిటీ శానిటేషన్ ప్లాన్, గ్రీన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి తదనుగుణంగా పనులు చేపడతామని సమాధానమిచ్చారు. కేఎంసీ కమిషనర్ జే.శ్రీనివాసరావు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles