నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి..

Thu,October 17, 2019 12:58 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సుమారు 300 మంది రైతులతో ఆయన కలెక్టరేట్‌కు వచ్చి, కలెక్టర్ కర్ణన్‌ను కలిసి సమస్యలను వివరించారు. నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా పేరుకున్న సమస్యలను పలువురు రైతులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌కు ఏ కరువు పెట్టారు. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచన మేరకు నియోజవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, సత్తుపల్లి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. నెల రోజులలోపు సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటకి చెందిన గిరిజనేతరుల భూములను గతంలో ఇందిరాసాగర్ ప్రస్తుత సీతారామ ఎత్తిపోతల పథకానికి తీసుకున్నారని, వాటికి నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు తెలిపారు.

పెనుబల్లి మండలంలోని లింగగూడెం, గంగదేవిపాడు గ్రామాల మధ్య ఒక హెక్టార్ దూరంలో బీటీ రోడ్డును నిర్మించారని, సంబంధిత కాంట్రాక్టర్‌కు ఇంతవరకు బిల్లు చెల్లించలేదని సండ్ర కలెక్టర్‌కు తెలిపారు. అదేవిధంగా కల్లూరు మండలంలోని చేపల సొసైటీలను ఆయా గ్రామాలలోని సొసైటీలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తద్వారా మత్స్య కార్మికులకు జీవనోపాధిని కల్పించిన వారవుతురని అన్నారు. పుల్లయ్య బంజర, కప్పలబంధం, వేంసూర్ మండలంలోని కందుకూరు తదితర గ్రామాలలోని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని కలెక్టర్‌కు గుర్తు చేశారు. పెనుబల్లిలోని టోల్‌గేట్ సెస్ ఆ మండల ప్రజలకే చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. టోల్‌గేట్ నిర్మాణమప్పుడు భూములు కోల్పోయిన వ్యక్తులకు పరిహారం ఇవ్వాలని, స్థానిక సంస్థలకు రావాల్సిన సెస్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపి లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ అక్కిరాల మోహన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు చీకటి రామారావు, వసంపూడి మహేశ్, అద్దంకి అనంతరాములు, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles