సజావుగా సాగిన ప్రయాణం

Wed,November 6, 2019 01:50 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి అధిక సంఖ్యలో బస్సులను యథావిధిగా నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నిరూట్‌లలో మొత్తం 244 బస్సు సర్వీసులను నడిపి ప్రయాణికులకు తిప్పలు లేకుండా చూశారు. సమ్మె కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బందులు పడొద్దని ముందునుంచి ప్రభుత్వం చెప్తూ వస్తూ దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టి ప్రజారవాణాకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూస్తుంది. గత 32 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె తాలూకు ప్రభావం ఎక్కడా పడకుండా ప్రధానమైన రూట్లే కాకుండా పల్లెలకు కూడా బస్సు సర్వీసులను పంపిస్తుంది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి బస్సులను అన్ని ప్రధాన రూట్‌లకు నడుపుతూ వచ్చారు. మంగళవారం కూడా హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, వరంగల్‌, పల్లె ప్రాంతాలకు సర్వీసులన్నింటినీ సాధారణ రోజుల్లాగానే నడిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు డిపోలలో మొత్తం 244 బస్సు సర్వీసులు నడిచాయి. కొత్తగూడెం డిపోలో 57 ఆర్టీసీ, 21 హైర్‌ బస్సులు, భద్రాచలంలో 66 ఆర్టీసీ, 22 హైర్‌ బస్సులు, మణుగూరు డిపోలో 57 ఆర్టీసీ, 21 హైర్‌ బస్సు సర్వీసులు నడిచాయి. మొత్తంగా 90శాతం పైగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. కాంట్రాక్టు క్యారియర్స్‌ 53, మోటార్‌ క్యాబ్స్‌ 191 నడిపి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

అన్ని రూట్‌లకు బస్సులు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో ఉండటంతో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రైవర్లకు అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా రవాణాశాఖ అధికారులు ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ మన్ననలు పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల పరిధిలోని డ్రైవర్లు క్రమశిక్షణగా డ్రైవింగ్‌ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. దీంతో వారిపై మరింత నమ్మకం ఏర్పడింది.

32వ రోజూ కొనసాగిన సమ్మె
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజు కూడా కొనసాగింది. తహసీల్దార్‌ విజయారెడ్డి మృతికి నిరసనగా ర్యాలీ చేసి కొత్తగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో ప్రదర్శన చేస్తుండగా పోలీసులు సమ్మె చేసే సెంటర్‌లో షామియానాను తొలగించడంతో కోపోద్రిక్తులైన ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులలో ఒకరు పెట్రోల్‌ బాటిల్‌ను బయటికి తీయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో త్రీటౌన్‌ సీఐ ఆదినారాయణ సకాలంలో స్పందించి పెట్రోల్‌ బాటిల్‌ను ఆందోళన కారుని దగ్గర నుంచి గుంజుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమ్మె వద్ద షామియానాను తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చని డీఎస్పీ చెప్పడంతో ఆందోళన విరమించారు.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles