-ఏసీ రకం మిర్చి క్వింటా రూ.20,021
-రెండు రోజుల వ్యవధిలో రూ.మూడు పెరిగిన ధర..
ఖమ్మం వ్యవసాయం. నవంబర్ 8: ఇంతకాలం ధరలలో హెచ్చుతగ్గులకు తావు లేకుండా జరిగిన ఏసీ రకం మిర్చి విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో మిర్చి పంట బంగారంతో పోటీ పడుతుంది. సీజన్ ఆరంభంలో కేవలం క్వింటా పదివేల లోపు మాత్రమే పలికింది. ప్రస్తుతం మార్కెట్లో తాలు రకం పంట ధర ఎర్రమిర్చి ధరలు పలుకుతున్నాయి. రైతును అనతి కాలంలో ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా, అదే రీతిలో నష్టపరచాలన్నా కేవలం మిర్చి పంటకు మాత్రమే సాధ్యపడుతుంది. గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రకం పంట ఇదే మార్కెట్లో క్వింటా ఒక్కంటికి రూ.5వేలు పలికింది. దీంతో అప్పట్లో మిర్చి పంట సాగు చేసిన రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు.
నేడు ఇదే రకం పంటకు ఆల్టైమ్ రికార్డు ధర పలకడం విశేషం. గత పక్షం రోజుల నుంచి తేజా రకం పంటకు జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుండటంతో పంటను నిల్వ ఉంచుకున్న రైతులకు సిరులు కురుస్తుంది. ఉదయం మార్కెట్ పరిధిలోని శీతల గిడ్డంగులలో జరిగిన క్రయవిక్రయాలలో మిర్చి ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేశారు. దీంతో ఎర్రబంగారానికి రికార్డు స్థాయిలో క్వింటా ఒక్కంటికి రూ.20,021 పలికింది. తాలు రకం పంటకు క్వింటాకు ఒక్కంటికి రూ.9 వేల నుంచి 10వేల వరకు ధర పలకడం విశేషం. ఏది ఏమైన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్కెల్లో పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో నిల్వ చేసుకున్న రైతులు సంతోషంలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కొత్త పంట చేతికి రానుండటంతో మిర్చిసాగు చేసిన రైతులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు.