చెక్ బౌన్స్ కేసులో ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్

Wed,November 13, 2019 11:57 PM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: చెక్‌బౌన్స్ కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరెస్టయ్యారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం..అశ్వారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈదర వెంకటేశ్ ఇదే పాఠశాలకు చెందిన పూర్ణచందర్‌రావు అనే వ్యక్తి నుంచి కొంతకాలం క్రితం రూ.4 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. ఎంతకాలమైనా వెంకటేశ్ డబ్బు చెల్లించకపోవడంతో పూర్ణచందర్‌రావు చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. బాధితుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టులో కేసు దాఖలు చేశాడు. చింతలపూడి పోలీస్‌లు దీనిపై క్రిమినల్ కేసు నమోదైంది. కేసు విషయంలో ప్రధానోపాధ్యాయుడు కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు వెంకటేశ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ప్రధానోపాధ్యాయుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఈ నెల 11వ తేదీ) ఉదయం ఏపీలోని చింతలపూడి పోలీసులు వెంకటేశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

గతంలోనూ ఆరోపణలు..
అశ్వారావుపేట ఎంఈవో పి.కృష్ణయ్య ఈ విషయాన్ని డీఈవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్ గతంలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల నుంచి వసూలు ఫీజును ఆయా విభాగాల కో-ఆర్డినేటర్‌గా నిధులను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షల ఫీజును ఆయా బోర్డులకు చెల్లించకుండా సొంతానికి వినియోగించుకున్నారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు సత్తుపల్లిలోనూ ఒక చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నాడన్న వార్తలు స్థానికంగా హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్‌ను వివరణ కోరేందకు నమస్తే తెలంగాణ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అశ్వారావుపేట ఎంఈవో పి.కృష్ణయ్యను వివరణ కోరగా హెచ్.ఎం వెంకటేశ్ అరెస్ట్ అయినట్లు తమకు సమాచారం అందిందని, ఈ విషయాన్ని డీఈవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles