ఇల్లెందుకు ఏమిచ్చారు?

Thu,November 14, 2019 12:00 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ: సింగరేణి సంస్థకు ఇల్లెందు జన్మనిచ్చింది! 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లెందుకు సింగరేణి సంస్థ ఏమిచ్చింది! రోజురోజుకు ఇల్లెందు నిర్వీర్యం అయిపోతుంది! బొగ్గుట్ట వెలవెలబోవడానికి కారణం సింగరేణి సంస్థ కాదా! పాల్‌టెక్నిక్, బీఈడీ, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదు! బొగ్గుకు జన్మనిచ్చినందుకేనా.. ఇల్లెందుపై వివక్ష! అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సింగరేణి డైరెక్టర్ల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. పన్నెండు మంది కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు హాజరైన ఈసమావేశానికి సీఎండీ ఎన్ శ్రీధర్ ముఖ్య అతిథి. ఈసందర్భంగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ మాట్లాడుతూ.. తనదైన శైలిలో మాటల తూటాల వర్షం కురిపించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్), సీఎస్‌ఆర్ నిధులు ప్రతీ ఏడాది ఎందుకు మంజూరు చేయడంలేదని ప్రశ్నించారు. బ్రిటీష్‌వారి హయాంలో నిర్మించిన రైల్వేస్టేషన్‌కు రైల్వే సర్వీసు ఎందుకు నిలిపివేశారని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు ఏరియాకు రోజుకు రూ.30 నుంచి 40 కోట్లు ఆదాయం ఉన్నప్పటికీ రైల్వే సర్వీసులను ఎందుకు పునరుద్ధరించడం లేదన్నారు. సంవత్సరాల తరబడి కోట్లాది రూపాయలను సంస్థ తీసుకుంటుందే తప్ప ఇల్లెందు పట్టణం, పరిసర గ్రామాలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి, గోదావరిఖని, కొత్తగూడెం పట్టణాలతో పోలిస్తే ఇల్లెందు పరిస్థితి ఏమిటో సింగరేణి సంస్థే ఆలోచించాలన్నారు.


ఇల్లెందు రోజురోజుకు వెనకబాటుకు గురవుతుందని, ప్రత్యేకించి నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందుకు ప్రతీ ఏడాది డీఎంఎఫ్, సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మైనింగ్ ఏర్పాటుకు అన్ని పర్మిషన్లు తీసుకుంటున్న సింగరేణి అభివృద్ధి చేయడానికి 1/70 యాక్టు అడ్డుగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మైనింగ్ పర్మిషన్ కావాలంటే సవాలక్ష అనుమతులతో కూడుకున్నదన్నారు. ఏజెన్సీలో 1/70 యాక్టు అభివృద్ధికి అడ్డుగా ఉందనడం ఎంతమాత్రం భావ్యం కాదన్నారు. 1/70 యాక్టు అడ్డుగా ఉన్నా కొన్ని నిబంధనల ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, సింగరేణి సంస్థ ఎందుకలా ఆలోచించడం లేదో అర్ధం కావడం లేదన్నారు. 21మైన్ 130 సంవత్సరాల చరిత్ర కలిగిందని, అలాంటి మైన్‌ను మూసివేస్తే ఇల్లెందుకు భవిష్యత్తు కరువవుతుందన్నారు. మైన్‌ను మూసివేయకుండా ప్రత్యామ్నాయం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థకు అతి పురాతనమైన మైన్‌గా గుర్తించబడ్డ 21 మైన్‌ను పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సింగరేణికి జన్మనిచ్చిన ఇల్లెందు(బొగ్గుట్ట) చిహ్నం ఏర్పాటు చేయాలన్నారు. ఇల్లెందులో నూతనంగా ఏర్పాటైన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సింగరేణిదేనన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, అయినప్పటికి సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు. 21ఏరియా కాలనీ వాసులను సింగరేణి సంస్థ ప్రతీరోజు ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. 21 ఏరియాను ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎందుకంటే అక్కడ దశాబ్దాలుగా నివాసముంటున్న వారి తాతలు, తండ్రులు సింగరేణి సంస్థకు సేవలందించారని, అందుకు కృతజ్ఞతగా వారిని కరుణించాల్సిన బాధ్యత సంస్థదేనన్నారు. అందుకే ప్రభుత్వానికి అప్పగించాలని తేల్చి చెప్పారు. టేకులపల్లి మండలం తడికెలపూడి వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ కారణంగా పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆసమస్యలను అరికట్టాలని సింగరేణి సీఎండీకి వివరించారు. అంతేకాకుండా ఇల్లెందు పట్టణాన్ని సుందరవనంగా సింగరేణి సంస్థ తీర్చిదిద్దాల్సిందేనని స్పష్టం చేశారు.

డీఎంఎఫ్, సీఎస్‌ఆర్ నిధులు అన్ని ఏరియాల కంటే ఇల్లెందు ఏరియాకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. సింగరేణి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఇల్లెందులో లేకపోవడం చాలా దారుణమన్నారు. సింగరేణికి జన్మనిచ్చిన ఇల్లెందుకు సంస్థ ఏంచేసిందో ఒక్కసారి పునరాలోచించుకోవాలన్నారు. ఇకనైనా మానవీయ కోణంలో ఇల్లెందు ఏరియాపై దృష్టి సారించి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయాలని సీఎండీని కోరారు. ఎమ్మెల్యే హరిప్రియనాయక్ మాట్లాడిన తీరుపై సీఎండీ స్పందించారు. ఇల్లెందు ఏరియాకు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇల్లెందు ఏరియా కార్మికులు, పరిసర గ్రామాల ప్రజల కోసం యువ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ స్పందించిన తీరు అమోఘమని ప్రశంసించారు. అనంతరం కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్‌ను అభినందించారు.

280
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles