బడిలో మోగిన.. ఎన్నికల గంట

Wed,November 20, 2019 01:17 AM

-విద్యాకమిటీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-22న నోటిఫికేషన్, 30న ఎన్నికలు
-చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక
-కలెక్టర్ అనుమతి కోసం విద్యాశాఖ ఫైల్
-జిల్లాలో మొత్తం 1323 సర్కారు బడులు
(ఖమ్మం ఎడ్యుకేషన్):పాఠశాల విద్యారంగంలో విద్యార్థుల తల్లిదండ్రులదే కీలక భూమిక కానుంది. పాఠశాల అభివృద్ధి, సౌకర్యాల పరిశీలన ఆజమాయిషీతోపాటు కలిసి పనిచేద్దాం.. బడిని నడిపిద్దాం అనే పద్ధతిలో బాటలు వేసేలా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు పనిచేయనున్నాయి. ఏ ప్రభుత్వ పథకమైనా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అది పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల యాజమాన్య కమిటీలనూ నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రతి ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న (ఎయిడెడ్) పాఠశాలల్లోనూ తప్పనిసరిగా యాజమాన్య కమిటీలను ఏర్పాటుచేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

30వ తేదిన ఎన్నికలు..
పాఠశాల నిర్వహణకు, ప్రగతికి, విద్యాహక్కు చట్టం అమలుకు, బాలల హక్కుల పరిరక్షణకు ఏర్పాటైన, చట్టబద్ధత కలిగిన వ్యవస్థ పాఠశాల యాజమాన్య కమిటీ. ఇంతటి ముఖ్యమైన ఈ కమిటీలను పారదర్శకంగా ఎన్నిక చేసేలా ఎంఈఓలు పరిశీలిస్తారు. ఎన్నికైన కమిటీ రెండు సంవత్సరాలపాటు మనుగడలో ఉంటుంది. ఎన్నికైన సభ్యుడి కుమారుడు/ కుమార్తె పాఠశాలను వదిలి వెళితే అతని సభ్యత్వం రద్దవుతుంది. పాఠశాల యాజమాన్య కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, హెచ్‌ఎంలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 30న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. 22న నోటిఫికేషన్‌ను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 26న ఉదయం తుది జాబితా విడుదల చేస్తారు. ఓటర్ల జాబితాలో విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల్లో ఒక్కరే ఓటుకు అర్హులు.

కలెక్టర్ అనుమతి కోసం ఫైల్..
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ అనుమతి కోసం విద్యాశాఖాధికారులు ఫైల్ పంపారు. స్కూల్ యాజమాన్య కమిటీల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించేందుకు ఇన్‌చార్జ్‌గా జీసీడీఓ చల్లపల్లి ఉదయ్‌శ్రీని డీఈఓ మదన్‌మోహన్ నియమించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 844, ప్రాథమికోన్నత పాఠశాలలు 203, ఉన్నత పాఠశాలలు 276 ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లోనూ ఈ ఎస్‌ఎంసీల ఎన్నికలు జరగనున్నాయి.

సభ్యుల ఎన్నిక ఇలా..
-ప్రతి తరగతికీ ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలుంటారు.
-ఇందులో ఒకరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి పిల్లల, అనాథ, ఎస్సీ, ఎస్టీ, వలస వచ్చిన, హెచ్‌ఐవీ బారిన పడిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి.
-మరొకరు బలహీన వర్గాలకు చెందిన పిల్లల (బీసీ, మైనార్టీ, వార్షికాదాయం రూ.60 వేలు మించని ఓసీ తల్లిదండ్రుల పిల్లలు) తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి.
-మూడో వ్యక్తిని ఎవరిని అయినా ఎన్నుకోవచ్చు.

పేరెంట్స్ కమిటీలకు కీలక బాధ్యతలు..
-ప్రస్తుతం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో స్కూళ్ళ సమగ్రాభివృద్ధికి పేరెంట్స్ కమిటీలను బలోపేతం చేయనుంది.
-బడి బాగా నడిచేలా ఆజమాయిషీ చేయాలి.
-బడి అభివృద్ధికి ప్రణాళికను తయారు చేయాలి.
-పిల్లలకు చదువు - ప్రగతి పరిశీలన, బడికి సంబంధించిన రికార్డుల పరీశీలన చేయాలి.
-ప్రణాళికలో రాసుకున్న పనులను అనుకున్నట్టుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
-బడికి ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించేలా చూడాలి.
-బడి సౌకర్యాల వినియోగం, ఉపాధ్యాయుల సమయపాలన, తరగతుల బోధన వంటివి పరిశీలించాలి.
-తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.

259
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles