రైతులకు అందుబాటులో ఉండాలి

Thu,July 4, 2019 03:57 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : రైతులకు అందుబాటులో ఉండి, పంటలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో బుధవారం వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. మక్క పంటలో కత్తెర పురుగు, పత్తి పంటలో గులాబీ పరుగు నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పురుగులు దరిచేరకుండా పంట విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి, పురుగు ఉనికి గమనించాలన్నారు. పొలంలో నలుమూలలా తిరిగి పురుగు ఆశించిన మొక్కలను గమనించాలనీ, సామూహికంగా సస్యరక్షణ చర్యలు చేపట్టేలా రైతులను చైతన్యపర్చాలన్నారు. మక్కలో అంతర పంటలు సాగుచేసుకుంటే మంచిదనీ, దీంతో పురుగు తక్కువ ఆశిస్తుందని వారికి తెలిసేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పంటలను రక్షించే క్రమంలో పురుగు మందు ద్రావణం మొక్క సుడిలో పడేలా సాయంకాలంలో పిచికారి చేయించాలన్నారు.

కాలంలో రెండు, మూడు సార్లు మాత్రమే క్రిమిసంహారక మందులను వాడేలా, అధిక మోతాదులో వాడకుండా చూడాలన్నారు. ఆ సమయంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకునేలా తెలుపాలన్నారు. రైతు బీమా పథకంలో ఏమైనా సమస్యలున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వారికి కేటాయించిన ప్రదేశంలో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండి, వారి సమస్యలు తీర్చాలని ఆదేశించారు. అనంతరం మక్క పంటను ఆశించే కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, సిబ్బంది, తదితరులున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles