యువ ఆశలు గల్లంతు

Mon,September 16, 2019 12:39 AM

-రమ్య క్షేమంగా తిరిగిరావాలని స్నేహితుల పూజలు
-విషాద వదనంలో రెండు కుటుంబాల సభ్యులు
-కాగజ్‌నగర్‌లో రమ్య, నిర్మల్‌లో లక్ష్మణ్ విధులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు విహార యాత్ర విషాద యాత్రగా మారింది. 61 మందితో వెళ్తున్న పడవ గోదావరిలో మునిగిన ఘటనలో ఇద్దరు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలానికి చెందిన ఏఈలు లక్ష్మణ్ మృతి చెందగా, రమ్య అచూకీ లభించలేదు. నంనూరు గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి కార్కూరి సుదర్శన్-భూమక్క దంపతుల కూతురు రమ్య.. కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు రామయ్య-శాంతమ్మ కుమారుడు లక్ష్మణ్ ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈలుగా ఉద్యోగాలు సాధించారు. ఆదివారం వరంగల్‌లోని ఇతర స్నేహితులతో కలిసి పాపికొండలు విహార యాత్రకు వెళ్లగా, వీళ్లు ప్రయాణించిన పడవ గోదావరిలో బోల్తాపడింది.

చదువులో ఆదర్శం రమ్య..
నంనూరు గ్రామానికి చెందిన కార్కూరి సుదర్శన్-భూమక్కల కూతురు రమ్య చిన్నప్పటి నుంచి చదువులో చలాకీగా ఉండటమే కాకుండా వెనుకబడిన తన స్నేహితులకు కూడా సహాయం చేసేది. తన తండ్రి కూడా విద్యుత్ శాఖలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ కావడంతో తాను కూడా విద్యుత్ శాఖలో ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఇటీవల కొత్తగా నియమించబడ్డ విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నది. ఇటీవలే వేతనం తీసుకున్న సందర్భంగా మొదటి వేతనంతో వారి వాడలో వినాయక విగ్రహం కొనిచ్చి పూజలు జరిపి నిమజ్జనం రోజు కూడా అందరితో ఆడిపాడింది. రమ్యకు బీటెక్ చదువుతున్న తమ్ముడు రఘు ఉన్నాడు. రమ్య గల్లంతుతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో ఆందోళన మొదలైంది. రమ్య సేఫ్‌గా రావాలని అందరు పూజలు చేస్తున్నారు.

తండ్రి లేకపోయినా ఉద్యోగం సాధించి..
బొడ్డు లక్ష్మణ్ తండ్రి రామయ్య సింగరేణి ఉద్యోగి. కాగా పదేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు కవలలు జన్మించగా లక్ష్మణ్ చదువులో ఎప్పుడు మొదటి స్థానంలో నిలిచేవాడు. ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని సోదరుడు రాము కూడా ప్రభుత్వ ఉద్యోగే. మొదటి సోదరుడు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles