నేడే ప్రకటన

Thu,September 19, 2019 12:52 AM

-సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి
-సీఎంను కలిసిన సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు
-ఈ యేడాది లాభాలు రూ.1,700.65 కోట్లు
-పెంపుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కార్మికులకు భారీగా లబ్ధి చేకూరనుంది. గతేడాది 27 శాతం ప్రకటించారు. అప్పుడు సింగరేణి రూ.1,212 కోట్ల లాభాలు గడించింది. అంచనాలకు మించి లాభాలను సంస్థ ఆర్జించడంతో కార్మికులకు వాటా భారీగా దక్కింది. రూ.327.24 కోట్లు కార్మికులకు అందించారు. ఈ ఏడాది కూడా రూ.1,700.65 కోట్ల లాభాలు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్మికులకు రూ.70 వేల నుంచి రూ.ఒక లక్షకు పైగానే వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక శాతం అదనంగా 28 శాతం ప్రకటిస్తేనే. ఇక ముఖ్యమంత్రి అదనంగా రెండు నుంచి మూడు శాతం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. అదే జరిగితే కార్మికులకు భారీస్థాయిలో మేలు జరగనుంది. ప్రస్తుతం సింగరేణిలో 57 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే లాభాల వాటా భారీగా పెరిగిందని తమకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కార్మికులు చెబుతున్నారు. గురువారం ఎంత మేరకు ప్రకటిస్తారనే విషయంలో ఆశతో ఎదురు చూస్తున్నారు.

లాభాల్లో దూసుకువెళ్తున్న సంస్థ
గడిచిన పద్దెనిమిదేళ్లుగా సింగరేణి సంస్థ లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. 1997-98 నుంచి లాభాల వాటా కార్మికులకు ఇవ్వడం మొదలు పెట్టారు. 1996-97లో బీఐఎఫ్‌ఆర్ నుంచి బయటపడిన తర్వాత సుమారు రెండు దశాబ్దాలుగా లాభాలు సాధిస్తూనే ఉంది. సంస్థ అప్పుపై రూ.850 కోట్ల మారటోరియం ప్రకటించిన తర్వాత సంస్థ పురోగమనం దిశగా ముందుకు వెళ్లింది. ఆ తర్వాత సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూడలేదు. కార్మికులే కష్టనష్టాలకు ఓర్చి తమ సంస్థను కాపాడుకున్నారు. బీఐఎఫ్‌ఆర్ పరిధి నుంచి బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున లాభాలు సాధిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలో కేవలం సింగరేణి మాత్రమే.

ఏటేటా పెరుగుతున్న వాటా
సింగరేణి సాధించిన బొగ్గు ఉత్పత్తి, చేసిన వార్షిక వ్యాపారం ఆధారంగా లాభాల వాటా ప్రకటించడం ఆనవాయితీ అయినా అది గతంలో కేవలం నామమాత్రమే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాలతో సంబంధం లేకుండా కార్మికులకు ఇచ్చే లాభాల వాటా శాతాన్ని ఏటా పెంచుతూ వచ్చారు. గత ప్రభుత్వాలు 14 ఏండ్లలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే పెంచాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌గా అధికారంలో వచ్చాక కేవలం నాలుగు ఏండ్లలో అది తొమ్మిది శాతం అదనంగా పెరిగింది. 1999-2000 సంవత్సరంలో పది శాతం ఇవ్వగా 2012-13లో 18 శాతం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ దాన్ని పెంచుతూ పోయారు. 2013-14లో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 20 శాతం అందించారు. 2016-17 సంవత్సరంలో రూ.998 కోట్ల లాభాలకు 25 శాతంలో కార్మికులకు రూ.242 కోట్లు అందించారు. ఇలా ప్రతి ఏటా పెంచుతూ పోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతిగా ఎప్పుడు రెండు శాతం పెంచుతూ వస్తున్నారు. దీంతో కార్మికులకు లబ్ధి చేకూరుతోంది.

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం..
సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, సండ్ర వెంకట వీరయ్య, రేగ కాంతారావు, హరిప్రియ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలు అన్నింటిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. వాటంటిని సావధానంగా విన్న ఆయన వాటన్నంటిని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఏడాది మాదిరిగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీలో కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించే అంశాన్ని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles