ఆడబిడ్డా అందుకో సద్దుల సారె..

Mon,September 23, 2019 07:05 AM

-నేటి నుంచే బతుకమ్మ చీరెల పంపిణీ
- జిల్లాలో 1,75,395 మందికి కానుక
- గోదాములకు చేరుకున్నవి 1,09,395
-కులమతాలకతీతంగా అందజేత
-ఆనందంలో మహిళాలోకం

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. జిల్లాలో 1,75,395 మందికి బతుకమ్మ సారె అందించాలని సంకల్పంగా పెట్టుకున్నారు. అన్ని మండలాల్లోని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సద్దుల కానుకగా సర్కారు అందిస్తున్న చీరెలను చూసి ఆడబిడ్డలు మురిసిపోతున్నారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునేందుకు తెలంగాణ సర్కారు చీరెలను కానుకగా ఇచ్చి సత్కరిస్తున్నది. ఈ చీరెలు పది డిజైన్లు, వంద రంగులతో అందిస్తున్నది. గత గురువారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లో సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను సందర్శించారు. 65 ఏండ్ల మహిళలకు ప్లేన్ చీరలు, 18 ఏళ్ల వయసున్న యువతులకు చెక్స్, లైనింగ్ చీరలు పంపిణీ చేయనున్నారు. చీరెలు అందుకునే మహిళలు ఆధార్, తెల్లరేషన్‌కార్డు, పదో తరగతి మెమో, యువతులు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి చూపించాలి. ఇప్పటికే జిల్లాకు 1,09,395 చీరెలు చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో మిగతావి కూడా వస్తాయని అధికారులు వెల్లడించారు.

నేడు జడ్పీ అధ్యక్షురాలు, కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేత
బతుకమ్మ చీరెలను సోమవారం ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పంపిణీ చేయనున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగంబస్తీ, రాంనగర్, పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లిలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే చీరెలు జిల్లా కేంద్రం నుంచి మండలాలకు.. మండలాల నుంచి రేషన్ దుకాణాలకు చేరుకున్నాయి.

పారదర్శకంగా పంపిణీ : జేసీ రాంబాబు
బతుకమ్మ చీరెలను అర్హులైన వారికి అందజేస్తామని జాయింట్ కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం రాంపూర్‌లోని గోదాంలో చీరెలను పరిశీలించారు. సోమవారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో వివిధ మండలాలకు సరఫరా చేశారు. చీరెల పంపిణీని పారదర్శకంగా చేయాలన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles