పట్టణాలకు దీటుగా..పల్లెలు అభివృద్ధి చెందాలి

Tue,September 24, 2019 02:04 AM

మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ మండలం కోడూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారన్నారు. అన్ని గ్రామాల ప్రజలు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి తమ తమ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. తమ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో గ్రామస్తులందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జెడ్పీ సీఈవో యా దయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, డీపీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, ఎంపీడీవో వేదవతి, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles