భూసిమెట్టకు సొబగులు

Sat,October 12, 2019 11:33 PM

జైనూర్‌: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 30రోజుల ప్రత్యేక ప్రణాళికతో పల్లెలకు నూతన సొబగులు అద్దుకుంటున్నాయి. మండలంలోని భూసిమెట్ట కొత్తగా ఏర్పడిన పంచాయతీ. గతంలో రాసిమెట్ట అనుబంధ గ్రామంగా ఉండేది. పల్లెలో ఎనిమిది వార్డులు 300 ఇళ్లు, 550 మంది పురుషులు, 650 మంది స్త్రీలు, 1200 మంది జనాభా ఊరు బాగు కోసం ఒక్కటై నిలిచింది. ముళ్ల పొదలు, ఏపుగా పెరిగిన గడ్డితో ఉన్న పల్లె నేడు శుభ్రతకు మారుపేరుగా నిలిచింది. ప్రణాళిక పనులు చేపట్టిన మొదటి రోజు నుంచి డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రియంకా చౌహాన్‌ ఊరి బాగు కోసం ఆలోచించి ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేయాలని గ్రామస్తులకు ఆమె సూచించారు. దీంతో అప్పటిదాక పట్టించుకొని ప్రతి ఇల్లు, గల్లీ, మురుగు కాలువ, రోడ్లన్నింటిపై దృష్టి పెట్టారు. ఇంటింటికీ దండుగా కదిలి ఊరు శుద్ధికి నడుంబిగించారు. గ్రామంలో దశాబ్దాలుగా రోడ్డు సమస్య ఉండేది. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ప్రణాళికలో భాగంగా శ్రమదానం చేపట్టి సమష్టిగా గ్రామాభివృద్దికి కృషిచేశారు. అన్ని వీధుల్లో మొరంతో రోడ్డు మరమ్మతు పనులు చేశారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా సుమారు 5 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు కంచెలు ఏర్పాటు చేయడంతో గ్రామ రూపురేఖలు మారాయి. 30 రోజు ప్రణాళికతో గ్రామాభివృద్దిని చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించాం
గ్రామస్తులు, అధికారులతో కలిసి గ్రామంలోని సమస్యలు చాలా పరిష్కరించు కున్నాం. గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనుల్లో ప్రజలు సైతం భాగస్వాములయ్యారు. నేను సర్పంచ్‌ అయినప్పటి నుంచి 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనుల ఫలితాలు చాలా మెరుగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా పరిశుభ్రత కనిపిస్తుంది.
-కోట్నక మొతుబాయి మాధవ్‌రావ్‌, సర్పంచ్‌, భూసిమెట్ట

చాలా కష్టపడ్డాం
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో మేమందరం చాలా కష్టపడ్డాం. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, గ్రామస్తులం దరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. గ్రామంలో రోడ్డు సమస్య ఉండగా మరమ్మతు చేపట్టినాం. రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటినం..వాటిని సంవత్సరం వరకు గ్రామస్తులు సంరక్షిస్తే ఆ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది.
-ప్రియంకాచౌహాన్‌ , డిప్యూటీ రేంజ్‌ అధికారి

మా ఊరు బాగైంది..
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో మా ఊరు ఎంతో బాగైంది. చెత్త, పెంటకుప్పలు లేకుండా శుభ్రపరిచాం. రోడ్డు మరమ్మతులు చేసినాం. రోడ్డు ప్రక్కన ఇరువైపులా మొక్కలు నాటి వాటికి కంచెలు ఏర్పాటు చేశాం. తాగునీటి బావులను శుభ్రపరిచాం. ఇలా అన్ని పనులను అధికారులు పర్యవేక్షించగా ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.
-జాడి విజయ్‌, ఎఫ్‌ఏ, భూసిమెట్ట

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles