రాతినేలలో సేంద్రియ సాగు

Mon,October 21, 2019 12:40 AM

తిర్యాణి: ఒకప్పుడు అక్కడ వ్యవసాయమంటేనే కత్తి మీద సాము లాంటిది. ఏటు చూసినా రాళ్లు అందులో వ్యవసాయం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు భరించిన ఆ గ్రామ రైతులు ఇప్పుడు వందశాతం సేంద్రియ ఎరువులతో అధికదిగుబడి సాధిస్తూ మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని మాణిక్యాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుండాల గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఏటు చూసినా రాళ్లురప్పలు అందులోనే వరి, జొన్న, కంది, పెసర, పత్తి, మక్కజొన్న, శనిగలు, చిరుధాన్యాలు తదితర వర్షాధార పంటలు వేసుకునేవారు. అదే ఆ గ్రామంలో చదువుకున్న బొజ్జిరావు అనే యువకుడికి వచ్చిన ఆలోచన ఆగ్రామ గిరిజనుల జీవితాలనే మార్చి వేసింది. నాపరాళ్లపై అడుగున్నర మందంతో మట్టిని వేసి రాతి నేలను వరి సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో గుండాల రైతులు రాళ్లల్లో చిరుధాన్యాలు పండిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో వందశాతం సేంద్రియ ఎరువులను వేసి వరి సాగు చేశారు. రసాయన ఎరువుల వాడకానికి ఏమాత్రం తీసిపోకుండా అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం కింద వ్యవసాయ అధికారులు మండలంలో గుండాల గ్రామాన్ని ఎంపిక చేశారు. దీని ద్వారా వ్యవసాయాధికారులు 50 మంది రైతులనే 50 ఎకరాల్లో వరి సాగు చేయించారు.

ఎకరానికి 35 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సమీప చెరువుల్లోని మట్టిని తెచ్చుకొని పంటపొలాల్లో వేసుకొని జీవామృతం, బ్రహ్మస్త్రం, పంచగవ్యల తయారీకి ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనిగపిండి, వేపగింజలు, వేపాకులు తదితర స్థానికంగా దొరికేవాటితోనే తయారు చేసుకొని పంటలపై పిచికారి చేసుకొని మేలైన పంటల దిగుబడి సాధిస్తున్నారు. అలాగే 50శాతం రాయితీపై ఖరీఫ్ సీజన్‌లో వరి, కందులు, పెసలు, రబీలో 90 శాతం రాయితీపై శనిగలు, చిరుధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, రాగు లు, సామలు తదితర చిరు ఆహారధాన్యాలను ప్రత్యేకంగా సాగు చేయడమే కాకుండా అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు రైతులకు వ్యవసాయ పనిముట్లను సైతం పూర్తి స్థాయి రాయితీపై అందించి వారిని ప్రభుత్వం ప్రోత్సహించడంతో పంటల సాగులో గుండాల రైతులు దూసుకపోతున్నారు. దీంతో అక్కడ పండించిన ధాన్యాలకు మార్కెట్ కంటే ఎక్కవ ధర పలుకుతోంది. దీనంతటికి అసలు కారణం గుండాలలో రైతులు సమష్టిగా ఉండి ఒకరి పనులను మరొకరు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles