మహిళలకు ఆర్థిక భరోసా

Mon,November 11, 2019 01:09 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 15 మండలాల్లో 7436 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో సంఘంలో 15 మంది వరకు సభ్యులు ఉన్నారు. జిల్లాలో 80 వేల 371 మంది సభ్యులు ఉన్నారు. 2015 నుంచి కోట్లాది రూపాయలలను బ్యాంకు లింకేజీల ద్వారా అందించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం, బ్యాంకు లింకేజీల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చింది. సంఘాల్లోని సభ్యులు చిరు వ్యాపారాలు, వ్యవసాయం, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటీర పరిశ్రమలలాంటి వాటి కోసం ఈ నిధులను వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సెర్ప్ ద్వారా అనేక రకాలుగా రుణాలను అందిస్తోంది. బ్యాంకు లింకేజీలతో, స్త్రీనిధి ద్వారా రుణాలను అందిస్తూ చిరు వ్యాపారాల్లో నిలదొక్కుకునేలా చేస్తోంది.

రూ. కోటి 43 లక్షలు విడుదల..
ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాలకు పెద్దమొత్తంలో రుణాలు అందిస్తున్నది. ఐకేపీ అనుబంధంగా స్త్రీనిధిని ఏర్పాటు చేసి ఏటా కోట్లాది రూపాయలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. 2015 నుంచి 2017 సంవత్సరం వరకు బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలకు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తున్నది. గతేడాది జిల్లాలోని 7454 మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 2 కోట్ల 17 లక్షల 54 వేల 700 వడ్డీ రాయితీని అందించగా, ఈ ఏడాది 4153 మహిళా సంఘాలకు రూ. 1 కోటి 43 లక్షల వడ్డీ రాయితీ విడుదల చేసింది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలకు తిరిగి వడ్డీ చెల్లించడంపై మహిళా సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles