ఇక పట్టణ ప్రణాళిక

Tue,November 12, 2019 02:53 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి నమస్తే తెలంగాణ : పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం 30 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసింది. పారిశుధ్య పనులతో పాటు తాగు నీరు, విద్యుత్ సమస్యల పరిష్కారం, రోడ్ల మరమ్మతులు, డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణంలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు. 30 రోజుల కార్యక్రమం ద్వారా పల్లెలు ప్రస్తుతం అద్దంలా మెరిసిపోతున్నాయి. త్వరలో ఇదే తరహాలో మున్సిపాలిటీల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 30 వార్డుల్లో పట్టణ అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రోజుకు రెండు వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

అర్జీల స్వీకరణ..
సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలను కూడా స్వీకరించనున్నారు. త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయనున్నారు. మున్సిపాలిటీలో వార్డుల్లో సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై సభల్లో వార్డు సభ్యులతో చర్చిస్తారు. రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా, తడి, పొడి చెత్తలకు వేర్వేరు బుట్టలను వినియోగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిషేధించడంలాంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇంటింటా మొక్కలు నాటడం, ఇంకుడు గుంతల ఏర్పాటు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, శిథిలమైన నిర్మాణాలను తొలగించడం, నీటి సరఫరా చేసే పైపులైన్ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles