సర్కారు విద్యార్థులకు రవాణా భత్యం

Sat,November 16, 2019 12:55 AM

-ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఆర్థిక భరోసా
-బస్సు సౌకర్యం లేని గ్రామాల వారికి వర్తింపు
-జిల్లా వ్యాప్తంగా 323 మందికిప్రయోజనం
-రూ.18.68 లక్షలు విడుదల..ఖాతాల్లో జమ
-2019-20 సంవత్సరానికి 329 మందిని గుర్తించి ప్రతిపాదనలు
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నది. పాఠ్యపుస్తకాలు మొదలు ఏకరూప దుస్తులు, సన్న బియ్యంతో కడుపునిండా భోజనం అందిస్తున్నది. సమీప గ్రామాల్లో బస్సుసౌకర్యం లేని మారుమూల గ్రామాల విద్యార్థులకు రవాణా భత్యం చెల్లిస్తున్నది. బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులను గుర్తించి, రానూ..పోను ఖర్చులను ప్రభుత్వమే నెలనెలా ఇస్తున్నది. ఇటీవల ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రవాణా చార్జీలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

323 మంది విద్యార్థుల గుర్తింపు
జిల్లాలో 2018-19 విద్యా సంవత్సరంలో రవాణా సౌకర్యం లేని గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులను గుర్తించారు. 6 నుంచి 8వ తరగతి చదువుతున్న 302 మంది విద్యార్థులకు రూ. 600 చొప్పున 10 నెలలకు రూ.18 లక్షల 12 వేలు, 5వ తరగతి వరకు చదువుతున్న 14 మంది విద్యార్థులకు రూ. 400 చొప్పున 10 నెలలకు రూ. 56 వేలు విడుదల చేసింది. మొత్తంగా 323 మంది విద్యార్థులకు గాను.. 316 మంది విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మిగితా ఏడుగురి విద్యార్థుల బ్యాంకు ఖాతాలను ఇవ్వకపోవడంతో వారికి డబ్బులు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన వెంటనే గతేడాదికి సంబంధించిన రవాణా చార్జీలను జమ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2019-20 విద్యా సంవత్సరానికి 329 మంది విద్యార్థులను గుర్తించి ప్రతిపాదనలు పంపారు.

కిలో మీటర్ల లెక్కగట్టి..
ప్రైవేటుగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను గుర్తించి.. కిలో మీటర్ల లెక్క గట్టి డబ్బులు అందిస్తున్నారు. బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి పాఠశాలకు ఉన్న దూరాన్ని గుర్తించి అదే ప్రకారం ఆర్టీసీ చార్జీల ప్రకారం అంచనా వేస్తున్నారు. కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలని విద్యాశాఖ నిబంధన చెబుతున్నది. అయితే.. ఈ నిబంధన మేరకు ఆయా గ్రామాల్లో పాఠశాలు లేకుండా ఉండి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా చార్టీలను చెల్లించి అండగా నిలుస్తున్నది. ఇలా గతేడాదికి సంబంధించి నిధులను విద్యార్థులున్న పాఠశాలల ఎస్‌ఎంసీ కమిటీల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles