మందకొడిగా పరిశీలన.. సదరం మరింత ఆలస్యం


Sun,July 14, 2019 12:06 AM

-సర్టిఫికెట్ల జారీలో జాప్యం
-ఒక్కో దవాఖానలో రోజుకు 50 మందికే స్క్రీనింగ్
-దవాఖానల్లో పరిమితులు విధిస్తుండటంతో తిప్పలు
- సడలించాలంటున్న వికలాంగులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వికలాంగ పింఛన్లకు సదరం సర్టిఫికెట్ల అనుసంధాన ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతున్నది. సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతుండటంతో అనుసంధానానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలా జిల్లాలో 2,583 మంది వికలాంగ పింఛన్ లబ్ధ్దిదారులు సదరం సర్టిఫికెట్లను అనుసంధానం చేయలేదు. దీంతో వారంతా దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వెలితే.. ఆసరా పింఛన్ల జారీ భాగంగా ఇది వరకు చాలా అక్రమాలు జరిగాయి. వికలాంగులు, అర్హులు కాకున్నా.. చాలా మంది పింఛన్లు పొందారు. అక్రమాల నివారణకు వైద్యారోగ్యశాఖ జారీ చేసిన సదరం సర్టిఫికెట్‌ను జతపరుచాలని ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు సదరం సర్టిఫికెట్లను తప్పనిసరి చేయగా, ఇప్పటి వరకు చాలా మంది సదరం సమర్పించకుండానే పింఛన్లను పొందుతున్నారు. జిల్లాలో మొత్తంగా 1,97,825 మంది లబ్ధ్దిదారులుండగా, వారిలో 26,494 మంది వికలాంగ పింఛన్‌దారులున్నారు. గతంలో అధికారులు చేసిన చిన్న పొరపాటుతో కొంత మంది అనర్హులకు సైతం వికలాంగ పింఛన్లు అందుతున్నాయి. అప్పట్లో సదరం తప్పనిసరి చేసినా అధికారులు ఆగమేఘాల మీద కొంత మందికి సదరం లేకుండానే పింఛన్లు మంజూరు చేశారు. అప్పటి నుంచి వీరంతా పింఛన్లను పొందుతూనే ఉన్నారు. తాజాగా సదరం అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీచేయడంతో వీరంతా కొత్త సదరం సర్టిఫికెట్ల కోసం దవాఖాన్ల బాట పట్టారు.

సమస్యాత్మకంగా స్క్రీనింగ్
జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జా ప్యం జరుగుతున్నది. దవాఖాన్లు విధించుకున్న లక్ష్యంతో ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. దవాఖానల్లో రోజుకు 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని గడువుగా పెట్టుకున్నారు. దీని మేరకు 50 మందికి మించి సదరం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం లేదు. ఇలా జిల్లాలో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సరోజిని, ఈఎన్‌టీ, కింగ్‌కోఠిలోని జిల్లా దవాఖాన, ఎర్రగడ్డల్లో సదరం స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండగా కేవలం 50 మందికి మాత్రమే చేస్తుండటంతో సమస్యలు వస్తున్నాయి. వీటిల్లోనూ సిబ్బంది కొరత, పరికరాలు పనిచేయకపోవడంతో వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలే వైకల్యంతో బాధపడుతున్న వీరు తరుచూ తిరగలేకపోతున్నామని వాపోతున్నారు. ఎర్రగడ్డ మానసిన వైద్యశాఖలలో కంప్యూటర్ పనిచేయకపోవడంతో ఇక్కడ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. సాక్షాత్తు ఇదే విషయాన్ని బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...